సంబంధనిశ్చయము
385
‘రాజా! నీకు కొన్ని గంటలు ఉపన్యాసము లీయాలోయ్! నిన్ను సమూలముగా కదల్చివేసే సంగతులు మాట్లాడలోయ్!’
రాజారావు భార్య పోయినప్పటినుండియు శుద్ధ వైరాగ్యమూర్తియైనాడు. ఏదియో ధ్యానము, విరాగమూనిన నతడు, ఈ జన్మము వృథా, ఈ జన్మము పెద్ద ఓటమి అన్న నిట్టూర్పు. డాక్టరున కుండవలసిన శుచిత్వము మాయమయిపోయినది. ఎందరు చుట్టములు కోరినను, ఎందరు స్నేహితులు ప్రార్థించినను మరల వివాహము చేసికొనుట కొప్పకొనలేదు. తల్లిదండ్రులు దీనముగ వేడినారు. వారు కాకినాడనుండి వారి స్వగ్రామమునకు, నటు వెనుక కుమారుని దగ్గరకు బోయినారు. ఛాందసులు, పూర్వకాలపు వారు.
రాజారావుకు పట్టుదల మెండు; పూర్వచారము లేమియు గిట్టవు. తన కుమార్తెలిరువురు పుట్టినప్పుడు బారసాల చేసికొనలేదు. రెండవకొమార్తె కలిగినప్పుడు శాంతియున్నను జరుపలేదు. పురిటిళ్ళలోనికి, మాలవాని యిళ్ళకు వెళ్ళినను బట్టలు విడుచువాడుకాడు. అదియంతయు తల్లిదండ్రులు భరించలేక పోవువారు. అయినను లోక మెరిగినవారు, ఎన్నియో యాచారములు మారిపోవుట కనుగొన్నవారును గాన పుత్రుని ఇష్టమువచ్చినట్లు పోనిచ్చినారు.
పుత్రుడు వివాహము చేసికొననని ఖండితముగ జెప్పుటచే వారు కుమారుని పట్టుదల నెరిగినవారు గాన కార్యములేదని మిన్నకుండిరి.
నారాయణరా విది యంతయు నెరుగును. ప్రపంచములో రాజారావు హృదయము మార్చవలెనన్న మార్చుటకు శక్తిగలవాడొక్క నారాయణరావే, నారాయణరావన్న రాజారావు ఆనందమున మునిగి పోవును. రాజారావన్న నారాయణరావు పరవశుడగును. ఇరువురు పరమేశ్వరుడన్న ప్రాణమువిడిచెదరు. పరమేశ్వరునకు నీ ఇరువురు కుంభక రేచకములు.
‘రాజా! నువ్వు యోగివా?’
‘కాను.’
‘ఈ ప్రపంచము, ప్రపంచ వాసనను నంతయు వదలివేసి సన్యాసివి. కావలెనని కోరికయున్నదా?’
‘అదే పరమావధిగా పెట్టుకొన్నాను.’
‘ముసలితనములోనా?’
‘ఎప్పుడు అంతరాత్మ ఆజ్ఞాపించితే అప్పుడు సిద్ధముగా ఉంటాను.’
‘అంతవరకు?’
‘రోగి నారాయణ సేవ చేస్తూయుంటాను.’
అరవిందాది మహాయోగులు, రాధాకృష్ణాది తత్వవేత్తలు ఏమి చెప్పారురా సన్యాసమును గూర్చి?’