పుట:Narayana Rao Novel.djvu/388

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
387
దుస్తంత్రము

నేను నా భార్యతో మోహావేశాన సంచరించే వాణ్ణి, అదే ఆమెను కొనిపోయిందని నా నమ్మకం. అబ్బా! ...... (అతని కన్నుల నీరు తిరుగుచున్నది) నేను పాపిని. ఇక అలాంటి పాపాలు చేయకుండా ఉందామని ... కాని నాలో నేను ఆలోచించుకొని, నా అంతరాత్మకు ఇష్టం అయితే, తప్పక నా తల్లి దండ్రుల ఒప్పిస్తాను....... నాకూ నీ ఆలోచనే తట్టింది, చెన్నపట్నంలో శ్యామసుందరిని చూచినప్పుడు. ఆమె నా బిడ్డలకు అద్భుతమైన తల్లి కాగలదు. దివ్యురాలైన సూరమ్మ తప్పక సంతోషిస్తుంది. నన్ను ఆలోచించనీ. నీ ఆత్మ నాఆత్మ ఇంత సామ్యమైనవి కాబట్టి ఒక ఓ ఆలోచన తట్టినది నారాయణా.’ అతని కన్నులలో నీరు ప్రవాహమయ్యెను. నారాయణుని కన్నులు చెమర్చినవి.

ఇరువురు శోకమును దాటిన మహదానందమున నా చీకట్లలో, నా చెట్ల నీడలలో దిక్కులలో కలసిపోయిరి.

౨౨

దుస్తంత్రము

రాజమహేంద్రవరము వచ్చినప్పటినుండియు వరదకామేశ్వరీ దేవికి మలేరియా జ్వరము పట్టుకొన్నది. రెండురోజులలో తగ్గిపోవునని జమీందారుగారు ఎంచినారు గాని, నాలుగురోజులైనను నూటమూడు, నూటనాలుగు డిగ్రీల జ్వరము వచ్చుచున్నది.

కొమార్తెలతో రావలసినదని ఇరువురల్లుళ్లకు తంతి వార్త లంపినారు.

ఆ రోజుననే నారాయణరావు, శారదయు రాజమహేంద్రవరం ప్రయాణమైనారు. విశ్వేశ్వరరావుగారును, శకుంతలయు వచ్చినారు.

నారాయణరా వత్తగారికడకేగి, కుశలప్రశ్న చేసి, యామె నాడిజూచి, జ్వరము నూటనాలుగుండునని యంచనా వేసికొనెను. కొయినామందు గుప్పుచున్నారు. నారింజ, బత్తాయిరసము, బార్లీజావ యిచ్చుచున్నారు.

ఆమె ఏలనో నీరసించిపోయినది. రాజమహేంద్రవరములో జమీందారు గారి కొక పూర్వకాలపు వైద్యుడున్నాడు. ఆయన ఎం. బి. సి. ఎమ్. పరీక్ష నెగ్గి, యుద్యోగము చేసి, యుపకార వేతనము పుచ్చుకొనుచు రాజమహేంద్రవరములో వైద్యము ప్రారంభముజేసెను. ప్రప్రథమమున మంచి వేద్యము నేర్చినవాడే, పేరు పొందినవాడే. నేడు వృద్ధసింహమువలె కోరలులేకున్నాడు. క్రొత్త గ్రంథము లేమియు చదువడు. క్రొత్త పత్రికల పారజూడడు. కొత్త మందుల జోలికి బోడు.’

నారాయణరా వాతని వైద్యమునకు బలమాపాదింప సంకల్పించి మామగారితో మఱిమఱియు దెల్పి రాజారావును రప్పించినాడు.

రాజారావు నాలుగురోజులు మలేరియాతో కుస్తీపట్టి అటెబ్రన్ బ్లాస్మో