Jump to content

పుట:Narayana Rao Novel.djvu/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామచంద్రునిరాక

381

‘’అన్నా! నువ్వేదన్నా నేను వేరభిప్రాయం పడగలనా?’ ఏలనో యామెకు గుండెలు ఝల్లుమన్నవి. ‘ఏమది? ఏమది?’

‘నా కల చెప్పనీ తల్లీ! ఇన్ని దినాలూ నాకు అనేకములగు ఆలోచనలు పుట్టుతున్నవి, నశించిపోతున్నవి. అద్భుతములు, ఆనందదాయకములు. దేశసేవ చేయ కంకణము కట్టుకొన్న విద్యావతి, బ్రహ్మచారిణిగా ఈ కాలములో, ఇట్టి పరిస్థితులలో జన్మ మెట్లు గడపుట? ఎంతటి వైరాగ్యహృదయులైనా, వైరాగ్యకర్ములైనా మానవులు తమ కెదురువచ్చు సైతాను, కామదేవుని భయంకరమైన తంత్రాలకు పడిపోతారు. క్రీస్తు, బుద్ధుడు, గాంధి మొదలగు అవతారపురుషులే అనేకములగు ఇబ్బందులతో ఆ పిశాచాల్ని జయింపగలిగారు. భగవద్గీత అందుకనే కర్మమార్గ ముపదేశించింది తల్లీ.’

శ్యామసుందరి నిస్తబ్ధయై యూరకున్నది.

‘నాస్వప్నం, నాఆశయం! ఇరువురు ఉత్తములు, దేశసేవ చేయదలచినవారు, ఏకపథ సంచారులు, విడివిడిగా వారి జీవితముల వేరుమార్గాల ప్రసరించనీక ఏకాశయ పూర్ణావేశులై భార్యాభర్తలై దేశసేవ ఏల చేయరాదు? అని. నువ్వు బ్రహ్మచారిణివిగా ఉండటం ఎంత కష్టముతల్లీ! మనము మానవులం. ఎంత ఉత్తములైనా ఏ దుష్టకాలములోనో ఈ దేహానికి దాసులు కావలసి వస్తుంది తల్లీ! అది దాటుటకు మార్గమే గృహస్థాశ్రమం అని చెప్పారు. నీబోటి ఉత్తమురాలికి సరియైన స్నేహితుడు చేదోడైయున్న నీ యాశయం మరింత సులభంగా పూర్తి అవుతుంది కాదూ?’

శ్యామసుందరి మాట్లాడలేదు. ఎట్టకేలకు, ‘అన్నా, నీ ఉద్దేశం రెండు మాటల్లో చెప్పు’ అన్నది.

‘నువ్వున్ను, రాజారావున్నూ ఏల మీ జీవితనౌకలు జంటచేసి ఈ సంసార జలధిలో మీ ఆశయానంద ద్వీపం చేరరాదు? ఇరువురికీ ఒకే ఆశయము. ఒకేవిద్య. ఇరువురు ఉత్తములు. పారలౌకిక విషయములం దాపేక్ష, మిక్కుటముగా గలవారు. ఒకరికొకరు సహాయం. మీ యిద్దరు దేశానికి సేవచేయడం ఎంత ఉత్తమం! ఆ స్వప్నం నేను ఎన్నిసారులో నిర్మించుకొన్నాను. స్వప్నములో ఆనందం పొందాను. ఏమంటావు?’

శ్యామసుందరి నిర్ఘాంతయై ఆశ్చర్యమానసయై కొంతసేపటికి చిరునవ్వు నవ్వి,

‘అన్నా! నువ్వు యింటికి వెళ్ళు. నేను ఆలోచించుకొని నీకు తంతినిస్తా. నీ ఉదారమగు మనస్సు నా కెప్పుడు అవగతమే అన్నా’ అని యామె కన్నీరు విడిచినది. నారాయణరా వామె తలపై తన హస్తముంచి, యామెకు నమస్కరించి యందరికడ సెలవు తీసికొని వెడలిపోయినాడు.

గోదావరి స్టేషనులో రాజారావు, లక్ష్మీపతి, వీరభద్రరావు, భీమరాజుగారు, సుబ్బారాయుడుగారు, జానకమ్మగారు, రామచంద్రరావు తల్లిగారు,