పుట:Narayana Rao Novel.djvu/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామచంద్రునిరాక

379

‘నన్నెక్కడికి తీసుకొనిపోయెదరు?’

‘మధుర. అక్కడ కారాగారమున నుంచెదము.’

‘మా వారికి తంతి నీయవలయునే?’

‘మధుర నుండి యిచ్చెదరు గాక.’

మరునాడు మధుర చేరినారు. మధుర నుండి బావమరదికి తంతినిచ్చినాడు. ఎందుకు తన్నిట్లు బంధించుట? తానేమియు చేయలేదే? నేను అసహాయవాదినికాదే! ఇక నెందుకు? విప్లవకారుడనా? అదియుకాదే. అమెరికాలో ఉపన్యాస మిచ్చిన సంగతి చటుక్కున జ్ఞాపకమునకు వచ్చినది. ఏమో యావేశమున నేదియో య న్నాడు. అంతమాత్రమునకే! బావమరది ఖైదుకు వెళ్ళలేదా! తానును కారాగారమునకు పోయిన దేశమాత సేవయే. ‘తల్లీ, నీ పాదములకడ అడుగు పెట్టగనే భారతీయుడు బంధింపబడవలెనా?’ యనుకొన్నాడు. తనకు విప్లవము, కుట్ర నచ్చదు. ఏదో దేశములో శాస్త్రజ్ఞానము వృద్ధినందింప బాటు పడవలెననియు భరతమాత కీర్తి సర్వదిశల ప్రకాశింపజేయవలయుననియు నాతని వాంఛ. ఏది ఎట్లయిన నంతయు భగవంతుని చేతిలో నున్నది.

నారాయణరావు, రామచంద్రరావును నిర్బంధించిన నాల్గవరోజున మధురకు జేరుకొన్నాడు. కూనూరునుండి యా యువకుడు మధుర జేరుకొను లోపలనే రామచంద్రరావును సగౌరవముగ విడుదల చేయవలెననియు, అయినను చెన్నపురివరకొక గూఢచారిని వెంటబంపవలయుననియు రహస్యపు వార్త చేరినది. జమీందారుగా రీ నిర్బంధమును రామచంద్రరావునకు గల్పించినందులకు ప్రభుత్వము వారిపై నాత డేచర్యయు తీసికొనకుండునట్లు వాగ్దానము చేసెను. రామచంద్రునికి తాను వచ్చుచున్నట్లు జిల్లా రక్షకభటాధికారి పేర నారాయణరావు తంతి నిచ్చెను.

మామగారికి మనస్సులో నానందముతో, గృతజ్ఞతాపూర్వకమగు వందనములు చేయుచు నారాయణరావు మధుర స్టేషనులో దిగి, జిల్లా పోలీసు అధికారికడకు బోయినాడు. అచ్చట ఒక్క నిమేషము, ఎవరో తన బావమరదియో, రక్షకభటాధికారి యెవరో గుర్తింపలేకపోయినాడు. ఆ భటాధికారి యాంగ్లేయుడు. మరుసటిక్షణములో నానవాలుపట్టి రక్షకభటాధికారికి ముందు నమస్కరించి, వెనుక రామచంద్రరాయనికి నమస్కరించి అధికారిచూపిన యాసనముపై కూర్చుండెను. వారు మువ్వురు అనేక విషయముల గూర్చి మాటలాడుకొనిరి.

నారాయణరావు వచ్చినపుడే రామచంద్రరావు ‘బావా, యీయన నాకు చూపిన గౌరవము అపరిమితము. వీరిని నేనెప్పుడును మరువను. ఈయనయు లెక్కలలో ఆక్సుఫర్డులో బి. ఏ. లో కృతార్థుడైనాడట. ఎన్ని విషయములు చర్చించుకొన్నాము’ అని అన్నాడు.