Jump to content

పుట:Narayana Rao Novel.djvu/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

నారాయణరావు

‘మీ దేశ ముత్కృష్టమైనది. అట్టి పరమపూజ్యమగు దేశము స్వాతంత్ర్యమునకై పోరాడుచుండ ప్రపంచోద్ధారకమగు పరమశక్తి ఉద్భవిస్తుంది. యూదులు తమ దేశస్వాతంత్ర్యమునకై పోరాడుటవలననే అవతార పురుషుడగు క్రైస్తు జన్మించలేదా? ఆలాగు గాంధియో మరి యెవ్వరో ప్రపంచము తరింపజేయుటకు మీ దేశముననే యుద్భవించాలి.’

అని చెప్పినది. ఏమి యామె యుత్సాహము, ఆమె ప్రేమ! తప్పక హిందూదేశము వచ్చెదనన్నది. తనకు పునస్సంధానమహోత్సవము జరుగునాటి కామె బహుమతి వచ్చునట. తా నామెకు తన పునస్సంధానముహూర్తపు తారీకు తెలుపుచు తంతి నిచ్చినాడు. ఆత డిట్లాలోచించుకొనుచు అచటనున్న అరవల, తెలుగుల, ఔత్తరాహుల భాషల చెవులార వినుచు బులకించుచు రహస్యముగ దిరుగు కన్నీరు తుడుచుకొనుచు మంచి ఆంగ్లేయ హోటలులోనికి బోయి పూర్ణమగు భారతీయ భోజనము మాంసరహితమగుదానిని గొనిరమ్మని, గదిలోనికి బోయి భోజనపు దుస్తులు మార్చుకొని భోజనముచేసి రైలెక్కి పొలనారువా చేరుకొన్నాడు.

౨౦

రామచంద్రునిరాక

పొలనారువాలో (స్టీమరు) చిన్న పొగయోడ నెక్కి ధనుష్కోటిలో దిగి ఒళ్ళు పులకరించిపోవ భక్త్యావేశపూరితుడై, ఏరును చూడకుండ వంగి కొంత మన్ను తీసి ముద్దుగొని నోటిలో వేసికున్నాడు. అచ్చటనేయున్న యొక జానపదుడు ‘ఈ దొర మన్ను తిన్నాడేమి!’ యని యనుకొన్నాడు. ఇంతలో మువ్వురు పోలీసువారు, ఒక రక్షకభటాధికారియు, నిరువురు భటులు వచ్చి ‘అయ్యా, మీ పేరేమి?’ యని అడిగినాడు.

‘నా పేరు రామచంద్రరావు.’

‘ఇంటిపేరు?’

‘బుద్ధవరపు.’

‘అయ్యా! మిమ్ముల శ్రీ జార్జిసార్వభౌముని పేర నిర్బంధించుటకు నుత్తరు విదిగో. మిమ్ముల నిర్బంధించుచున్నాను’ అని యా రక్షకభటాధికారి యాతని భుజముపై చేయి వైచెను.

‘అలాగా అండి’ అని రామచంద్రరావు తెల్లబోయి, యిదేమి యని మనస్సులో చకితుడైనాడు. మోమున నిర్భయముతో చిరునగ వలంకరింప ‘ఇదేదో పొరపాటు. నన్నెందుకు మీరు నిర్బంధించుచున్నారో నాకు చెప్పగలరా?’ యనెను.

‘క్షమించండి. నాకు తెలియదు. మా పై అధికారులకు తెలియును.’