బంధితుడు
377
చెల్లెలు. ఆమె నెప్పుడు చేరకలుగునో? తన్ను చూడగానే యామె మోమున నెట్టిమార్పులు కలుగునో?
నారాయణరావుబావ గంభీరస్వనములు విని యెన్నాళ్లయినది!
తనతల్లి, ఆమె యెన్ని అశ్రువులు రాల్చినదో? ఎంత చిక్కినదో? భార్యనైన వదలవచ్చును, తల్లిని వదలలేము. తల్లీ! ఈ నిర్భాగ్యుడు ఎంత తెంపరియయి సుదూర దేశాలు పోయినాడు. ఎప్పుడు కాకినాడలో అడుగుపెట్టునో? తల్లి పాదాలపై మోము నుంచవలె. ఆమెయొడిలో ఒరిగిపోవునుగాక. ఆమె తన తల నిమురునా? పూజ్యులగు తండ్రిగారికి నమస్కారములు. తా నమెరికాలో చదువుకొన్నంత కాలము, ఎంత విచిత్రపు ప్రేమ నొలికించు నుత్తరములు వ్రాసినారు! వర్తకులగు తన స్నేహితులచే, తన కొమరుని స్నేహితులచే ననేకములగు వార్తల నంపినారు. మామగారు గంభీరులు. ఆయనకు భయములేదు. మానవ మహోత్కృష్టతయం దెంతయో నమ్మకము. ఆయన మేరువువలె నుండును. ఆయన యే యుగపు వీరుడో?
సూర్యకాంతము తనతో మాటలాడునా? తన పెళ్ళినాటి యామె రూపము, యీ నాటి యామె రూపవిలాసము! ఎంత మారినది? ఎవరా యని ఒక్క నిమేషము తాను తెల్లబోయినాడు, ఆఖరి ఛాయాచిత్రము చూచినప్పడు. శాంతి ఉన్నదన్నారు. తన బావ ముహూర్తముకూడ పెట్టినామని ఏడెనుకు తంతి నిచ్చినాడు. అతనికి తనపై నెంత ప్రేమయో! ఈ అందరి ప్రేమకు దాను బాత్రుడగుట కేమి చేసెనో?
సింహళము దరిసినది. కొలంబోలో నౌక ఆగినది. నౌకలో భరతదేశపు భోజనము పెట్టిరి. ఇటలీ దేశస్థులు భారతీయుల నెక్కువ గౌరవము చేసెదరు.
రామచంద్రరావు నౌక దిగుచు వెనుకటి తన నౌకా ప్రయాణము జ్ఞాపకము తెచ్చుకొన్నాడు.
లియోనారాకన్య యెంత ప్రేమార్ద్రహృదయ! అతని కా సాయంకాల దివ్యముహూర్త మీ జన్మమున మరపురాదు. ఏమి యానందమిచ్చినది! అతిపవిత్ర హృదయ. కాని ఆట్లు తన్నర్పించుకొన్నదే. ఎంత ప్రయత్నించినను తా నామె సౌందర్యమునకు, ప్రేమకు ముగ్ధుడైపోక తప్పినదికాదు.
ఆమె యేమన్నది–‘నా ప్రియతమ స్నేహితుడా రామచందర్, నీ భార్యతోపోయి సుఖముగా కాపురము చేయుము. మమ్ముల మరచిపోకుము. మాకందరకు హిందూదేశముపై నున్న ప్రేమ ఏ దేశమునందు లేదు.
‘ఏల మేము హిందూదేశ స్వాతంత్ర్యమునకు సాయము చేయుట లేదు? అని ప్రశ్నకదా? ఏ దేశమున కా దేశము ప్రయత్నించి విజయమందవలెను. నీవు భారతములోని పద్యము చదివి నాకు అర్థము చెప్పినావే. అటులే చివరకు మా దేశమువంటి దేశములు సాయము చేయును.