పుట:Narayana Rao Novel.djvu/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోకాల నావరించి, ఆమెను పూజించి, ఆమె దివ్య గాంధర్వములో లయమై, ఆమె పవిత్ర సౌందర్యజ్యోత్స్నలో కిరణమై ఆమెయు తానును లయమై పోవుట ఎన్నడు?

ఇంకను ఆమె గాఢోత్కంఠయై ప్రేమ మహా ఝంఝానిలముల గదలిపోవలె!

అతడు కదలక యట్లే స్వప్నమధురాకాంక్షల దేలిపోవుచుండెను. రాత్రిఘడియలు గడచిపోవుచునే యున్నవి.

• • • •

మరునాడు శారదాదేవి మొదటితరగతిలో గృతార్థురాలైనట్లును, సూర్యకాంతమున కన్నియు మంచిగుణములు వచ్చినట్లును జమిందారుగారు కూనూరునుండి తంతి నంపిరి.

నారాయణరావున కన్నియు శుభవార్తలే. రెండురోజుల క్రిందటనే రామచంద్రరావు నాలుగురోజులలో సింహళమందు దిగునని తంతి వచ్చినది.

ఇదివరకే చెన్నపురిలో రవ్వలు చెక్కిన గాజులజతలు రెండు, ఒక్కొక్కటి అయిదువందలకు నారాయణరావు కొన్నాడు. అవి పరీక్షలో నెగ్గబోవు నీ బాలల బహుమతులకే! సన్నని గాజులు, వానిపై నచ్చటచ్చట చక్కని చిన్న రవ్వలు. ఆ రెండుజతలు నారాయణరావు భార్యకొకటి, చెల్లెలికొకటి బహుమానము లిచ్చెను. వారెంతయు నుప్పొంగిరి.

ఆ రోజున సుబ్బారాయుడుగారు తన దొడ్డిలోని ఆడువారందరికీ ఖద్దరు రవికలగుడ్డలు, పండ్లు, బహుమతులు పంపించిరి.

శారద సంతోషము ద్విగుణీకృతమగునట్లు ప్రతివారు సూరీడును, శారదను బొగడువారే. సూర్యకాంతము శారదను కౌగలించుకొన్నది. ‘వదినా! మా అన్నగారు అమెరికా నుంచి నాలుగురోజుల్లో వస్తున్నారట గాదూ?’ అనినది శారద.

‘ఉండమ్మా వదినా! అన్నీ వేళాకోళాలు మొదలు పెట్టావు.’

సోమయ్య భార్య, జానకమ్మ గారితో తన యల్లునికి, తనకుమారునికి జరిగిన యుద్ధము, అల్లుని చెడునడవడి, చిన్న బాబయ్యగారు చేసిన యుపకారములన్నియు చెప్పినది. ‘ఆనాటినుంచి సీతన్న మారిపోయాడండి. నారాయణరావు గారు మంచి ప్రెబువు తల్లీ’ అని చెప్పుకొన్నది. శారద యా చిత్ర చరిత్ర వినుచు కన్నుల ఆనందపు వెలుగుల జిమ్మినది.

అందుకనా చల్లాలు త న్నతి గౌరవము చేయుచున్నది! తానన్న వెఱ్ఱి యాపేక్ష జూపుచున్నది. చల్లాలు, వెంకాయమ్మ ఒక్కయీడు, చిన్నతనమునుండి నారాయణుని ఆటలు పాటలు నన్నియు చల్లాలెఱుగును.