పుట:Narayana Rao Novel.djvu/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరీక్షాఫలితములు

371

గగు నా రూపము జూచి ఈయన దేవతవలె నున్నాడని యామె భావించి సిగ్గుపడునది. తన అక్క శకుంతల మరిదిగారన్న నెంత గౌరవము చూపును! తన తండ్రికి అల్లునిపై బ్రేమ యింతంత గాదు.

కొంచెమయినచో నెంత ఆపత్తు కలిగియుండును? ఎలాగునైన కొంచెము జాగ్రత్తగ నుండవలయునని నాన్నగారితో చెప్పించవలెను. ఈయన ఎంత పరోపకారి!

ఆమె హృదయము పూర్ణమైనది. తలుపులు దరిగ వేసికొని, నిదురించు తన భర్తను జూచి పులకరించిపోయినది. సిగ్గుచే మొగము జేవురింప నెమ్మదిగ తన భర్త పర్యంకముసేరి, యాతని తనివోవ బరికించి యాతనితల నంటియంటన ట్లంటినది. ఒక్కసారి యామె హృదయము పున్నమనాటి సంద్రమై ఉత్తుంగతరంగయుతమై పొంగినది.

ఈయన కాళ్ళకడ నేల పండుకొనరాదు? ఇతడేనా తన నాథుడు? తండ్రిగా రిదియంతయు చూచియేనా తన్నీ మహాభాగున కిచ్చినారు? ఆమె యాతనికి నమస్కరించినది. చిరునవ్వులు నాట్యములాడునా యన్నట్లు, సహజముగ వంపు రేఖలున్న యాతని పెదవుల జూచి తన పెదవుల మెత్తదనము తలచికొని ఆ పెదవుల...? ఆమె మత్తిల్లినది. కనుల బరువు లావరించినవి.

వెలుగున్నదో లేదో యనిపించు పడకగది దీపపువెలుగులు, నిదుర నటించు భర్త నొక దివ్యపురుషునిగ గన్పింపజేయ, నామె యాతని పదములకడ నెమ్మదిగ జేరి పండుకొన్నది.

ఆతని పాదములు తనయొడలికి దగులుటచే నేదియో వర్ణింపరాని అద్భుత మాధుర్యము విద్యుల్లతవలె నామె శరీరమంతయు ప్రాకిపోయినది.

ఈ ఉత్తమ పురుషుడు, ఈ సౌందర్యనిధి, ఈ వీరసింహుడు, తనభర్త! తన్ను ప్రేమించి తన్ను వివాహమాడినాడు. తానెంతమూర్ఖురాలయి సంచరించినది. పెన్నిధిని పెంటప్రోవనుకున్నది. ఈయన తన్ను చేపట్టునా? తన్ను తీయని మాటల నాదరించునా? ఆ గంభీరదృష్టులతో తన్ను చూడనైన చూచునా? ఆ వెడదరొమ్మున బలములు తిరుగు బాహువులతో తన్నదిమి వేయునా? తా నెంత శిక్షకైన అర్హురాలు. ఆమెకు భయ మావహించినది. ఆయన పాదములంటి వేయి మ్రొక్కులు మొక్కినను, ఆయన మన్నించునా? మన్నించునా?

ఇది యంతయు నారాయణరావు జూచుచున్నాడు. ఆమె తనకడకు వచ్చినప్పడు, తన తల నామె తాకినప్పుడు ఆతనియొడలు ఝల్లుమనిపోయినది. ఆతనిహృదయ ముప్పొంగిపోయినది. వేయితీపు లాతని నలమినట్లయినది. లేచి యా బాల నేల కౌగిలిలో నదిమివేయరాదు? రూపెత్తిన లాలిత్యము తన ప్రణయకాంత సౌందర్యము. సౌందర్యమునకు వన్నెలుదిద్దు సౌందర్యము. ఇన్నాళ్ళకు ఈమె తన్న నుగ్రహింపనున్నదా! జరిగిన దంతయు కల కానున్నదా? ఆమెను తన జీవితాశయమూర్తిగ నొనర్చుకొని, ఆమెతో