Jump to content

పుట:Narayana Rao Novel.djvu/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆకుమళ్ళు

363

అచట సూర్యరశ్మి చొరదు. వేడిగాలులు వీచవు. కొబ్బరియాకు చాపలు, పోకదొన్నెలు, పోకతోటలచలువ, పున్నాగముల సుగంధము, పచ్చనితోటలు, నీలపుంగోదావరి, నీలాకాశము, వివిధపుష్పాలు, ఫలరాజములు, బంగారమే పండు పసిమి కోనసీమ.

సీతాఫలములు, రామాఫలములు నోరూర చేయును. నీలపిల్లిగోవా, కొత్తపల్లి కొబ్బరి, పెద్దరసం, చెరుకురసం, బంగారుకలసి, సువర్ణ రేఖ, జహంగీర్, తీపిగుటక్, జొన్నలబారు మొదలగు మామిడి ఫలములు ఘుమ్ముఘుమ్మనును.

కొబ్బరితోటలు వేనకువేలు. ప్రతీతోటలో నీటిబొండాలు, గంగా ఫలాలు; కోనసీమ కొబ్బరిసీమ, గొనమలసీమ, క్రొన్ననసీమ.

మనవారు తిన్నగా నారాయణరావు తోటకడకు పోయిరి. మోములు కడిగికొని, స్నానము లాచరించి, పాలేరు కూడబట్టుకొనివచ్చిన బట్టలు ధరించి, యనతిదూరమున గూలివారు ఆకుమళ్ళకు నీరుపోయు వరిపొలముల వైపుకు బోయిరి.

ఆకుమళ్ల చెరువులోనుండి ఆకుమళ్ల పంపులలోనికి, కొన్ని కారెములు, కొన్ని గూడజంటలు నీరు తోడుచున్నవి. అందులో నొక బాలిక గొంతెత్తి పాటబాడ, నందరు పల్లవి నందుకొనుచుండిరి.


ఆకుమళ్ళాకు, నీ
రాకుమళ్ళాకు పోయి
          లచ్చుమయ్యా, నీమచ్చమాయా!

సోగా మీసాలయందం
సొంపూ తలపాగయందం
వూగేటీ వళ్ళుఅందం
రాగాల గొంతు కందం
         లచ్చుమయ్యా, నీ మచ్చమాయా!

దండాకడియాలు వెలుగు
కండాలు ముడిసుట్టు
సల్లాని నీయెదలో
ఒళ్ళూ ఝల్లనిపిస్తది.
         లచ్చుమయ్యా, నీ మచ్చమాయా!

జోడూజోడూ కలిసి
గూడెత్తి నీరేద్దం
నువ్వూ కొండలరాజ
నేనే గోదావరినదిని
         లచ్చుమయ్యా, నీ మచ్చమాయా!’