362
నారాయణరావు
‘రాజారావు అక్కయ్యని పరీక్ష చేసి, ‘ఈమె మనసు పాడయిపోయింది. మూర్ఛపట్టుకొని పిప్పిచేసి పిచ్చిలోకి దింపుతూంది. అప్పుడే గుండెజబ్బు, క్షయకు వచ్చేస్థితీ ఏర్పడ్డాయి. అందువల్ల ఈమె మనస్సు బాగుపడాలి. పనిచేయకుండా ఉండాలి. మంచి మందులు పుచ్చుకోవాలి’ అని చెప్పాడు.
‘అదంతా బావ వింటూనే ఉన్నాడే అమ్మా. ఆ మధ్యాహ్నం బావను రాజారావు చాటుకు తీసుకువెళ్ళి చెప్పాట్ట. ‘ఏమండీ వీరభద్రరావుగారు! నాకు తెలుసును. మీకు తెలియదు. నాభార్య పరమ పతివ్రత. ఏడాది ఏడాది కాన్పు. పశువులా సంచరించి బంగారంవంటి భార్యను చంపుకున్నాను. అటువంటి దివ్యభామినిని ఎవరివ్వగలరు. మీభార్య పతివ్రత. మీరు యిలాగే సంచరిస్తే ఆమె ఒక ఏడాదికూడ బ్రతుకదు. నేను వైద్యుణ్ణి గనుక చెపుతున్నాను.
‘రెండు, మీకు మీ భార్యపైన కోపం విపరీతంగా వస్తోంది. అంత కోపం తెప్పించుకోవడంవలన మెదడూ, గుండె పాడై పిచ్చో, గుండెజబ్బో తయారవుతుంది. మీ రకంవాళ్ళ గతులు ఆ వైద్యశాలల్లో మేము చూస్తూ ఉంటాముగనుక చెపుతున్నాను. ఆలోచించుకోండి’ అన్నాడు.
‘బావమరిది కొడతాడన్న భయం, భార్యకు పిచ్చో, ప్రాణభయమో వస్తుందన్న భయము, తన కేదో ఆపత్తు కలుగుతుందన్న భయము – యీ మూడు హడలుకొట్టినాయి కాబోలు. బావ రెండునెలలు సెలవుపెట్టి తన ఊరు వెడతానంటే మన యింటికివచ్చి ఉండమనీ, అతను గూడా మందు తీసుకోవాలని రాజారావు చెప్పాడు. సరేనన్నాడు. ఓ వారము రోజులలో వస్తాడు.’
• • • •
రాజారావు, నారాయణరావు, లక్ష్మీపతి పొలమువైపు ఉదయము వ్యాహ్యాళికి వెళ్ళినారు.
కోనసీమ సొబగు వేసవికాలములో వనలక్ష్మియే. ఆంధ్రదేశానికి కోనసీమ నాయకమణి. ఉభయ గోదావరీ మధ్యదేశము రత్నాలే పండుతుంది. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణరాయుడు దక్షిణాదిసీమ యందాలు తనివోవ వర్ణించినాడు. కోనసీమ సొబగున కొక మహాగ్రంథమైన ఆంధ్రాన జనింపలేదేమో? కోనసీమయందు సర్వశాస్త్ర పారంగతులైన యుత్తములు ఎన్ని వేల సంవత్సరములనుండి నివాసము చేయుచుండిరో?
కోనసీమ ఆ తరువుల మంజూష, మందమలయపవనములు, పనసపండులు, కాడమల్లె, బొడ్డుమల్లెలు, నారింజపూవులు, అరటితోటలు, కొబ్బరిపూవులు, పోకయాకులు, మామిడిపూతలు, మధురాతిమధుర సౌరభముల సర్వత్ర కలయంపి చల్లుచుండును. రంగురంగుల శర్కరకేళులు, పనసపండులు, జామ, బత్తాయి, నారింజ, మామిడిఫలములు కోనసీమయంతయు మధురరసపూర్ణమును జేసినవి.