Jump to content

పుట:Narayana Rao Novel.djvu/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆకుమళ్ళు

361

నారాయణరావు పకపక నవ్వుచుండెను. అందరు అతనిని జూచి తెల్లబోయిరి. రాజారావు మోమున మందహాసములు ప్రసరించినవి.

సుబ్బా: ఏమిటిరా బాబు?

నారా: ఏమిలేదు నాన్న! కోపం అంతా నటించాను. అతనికి కోపం తెప్పించి మాటలు వాగించి, భయపెట్టాలని ఎత్తువేశాను. ఆ ఎత్తులో పడ్డాడు.

‘ఏమండో బావగారు నిండుగా ఉన్నారు. ఇంట్లో పెళ్ళాంబిడ్డలు గంగలో కలిస్తే ఏమి? మనకారోగ్యం, మనకాయుస్సు అనుకోవడం, హోటళ్ళకు వెళ్ళి భోజనం చెయ్యడం, వహ్వ!’ అని అన్నాను. అతని మొహం జేవురించింది అప్పుడే. ఇదే సందు అని,

‘భార్యను చూలా లనైనా తలపక చెయ్యి చేసుగోడం చేతవును! ఏమి చక్కనివాడవు. ఎన్ని ఏళ్లు వస్తేయేమి? కొంచెము దయాదాక్షిణ్యం ఉండాలి. ఈవల జబ్బుతో, తిండి లేక మాడుతున్న భార్య విషయం అక్కరలేకుండా ఏం మొహం పెట్టుకొని హోటలులో తిండితిని వచ్చావు?’ అని అన్నా. అతనికి నిజంగా కోపం వచ్చింది, రుద్రుడయ్యాడు.

‘నీ మొహం చూడకూడదు. భార్యాభర్తల్ని ఎడబాపే పాపివి’ అన్నాడు. అంత వరకు తెల్లబోయినట్టు నటించాను.

‘రంకుముండ అప్పగారిని వెనకకూడా వేసుకువచ్చావు...’ అని అంటూఉంటే, మహాకోపం వచ్చినట్లు నటించి వెళ్ళి ‘కాసుకో పశువా! నేను నీకు బుద్ధి చెప్పుతా ఉండు’ అని నసాళం అంటేటట్లు రెండు లెంపకాయలు కొట్టాను. నాగరత్నం ఘొల్లుమంది. అక్కయ్య వింటూ ఉన్నది గదిలో. దానికి నాయెత్తు చెప్పలేదు కాదూ, కెవ్వున కేకవేసి వచ్చి మా యిద్దరిమధ్య పడి, నన్ను వెనక్కు లాగి, భర్తను కౌగిలించుకొని, ‘ఛీ ఛీ! నువ్వు నా తమ్ముడివికావు. నా మంగళ సూత్రానికి మాలిన్యం తెస్తావా? వెళ్ళిపో! నీకు కక్ష ఉంటే నన్ను చంపు’ అన్నది. అక్కయ్యని ఆ రోజున చూడాలి. కాళికాదేవి మహామాతే, నాకు అక్కగారే, సుబ్బారాయుడు గారి కూతురే. తత్ క్షణం ఆవిడ కాళ్లమీద బడ్డా! ‘అక్కయ్యా క్షమించు. నేను పాపిని. ఎప్పుడూ నాకు కోపం రాదు. బావ నిన్నంటే వచ్చింది’ అని అన్నాను.

‘బావ గజగజలాడుతూ ఉన్నాడు. అప్పుడు బావదగ్గరకు వెళ్ళి ఆతని చేయి పట్టుకొని ‘క్షమించు బావా! నేను ఏదో తొందరపడ్డాను. నీ భార్యను నువ్వు రండా అనడంవల్ల, నాకు ఒళ్ళు తెలియ లేదు’ అన్నాను.

‘ఆ రాత్రికే రాజారావూ వచ్చాడు. నెమ్మదిగా అందరికీ తాపాలు, కోపాలు తగ్గాయి. బావమరది తన్ను కొట్టకుండా కాపాడింది తనభార్య ఆనుకున్నాడో, మరేమో తెలియదు. రాత్రి భార్యను బ్రతిమాలుకున్నాడు. భార్య వద్దంటున్నా లెంపకాయలు కొట్టుకున్నాడు.