౧౬
ఆకుమళ్ళు
రెండవనాటి సాయంసమయమునకు నారాయణరావు, సత్యవతి, యామె కుమార్తె నాగరత్నం రాజారావుతో కొత్తపేట చేరినారు. సత్యవతిని జూచి జానకమ్మ గారు దిగులుపడి యామెను ఒడిలోకి చేర్చి కౌగలించుకొని ‘నాతల్లీ! ఎంత చిక్కినావమ్మా! నా అదృష్టం మండిపోయింది గనుక నిన్ను తీసుకెళ్ళి ఆ బ్రహ్మరాక్షసినోట్లో పారేశాము తల్లీ!’ యని వాపోవజొచ్చెను. సూరీడు, వెంకాయమ్మ, లక్ష్మీనరసమ్మగారు అందరు కన్నుల నీరు నించుకొన్నారు.
రాజా: పిన్నిగారూ చూశారా! సత్యవతి అక్కయ్యకు మూర్ఛవచ్చింది. అల్లాగ రాకూడదండి. ఉండండి, ఓహో చేతులుకూడా కొంకర్లుపోతున్నాయి. నారాయణరావూ, అక్కయ్యను ఎత్తుకు లోపలకు తీసుకురా. సూరీడు! చెంబెడు చన్నీళ్ళు, ఆర్జెంటు.
నారాయణరావు అంగలో అందరికి ముందు చల్లనినీరు పట్టుకొనివచ్చి, అక్కగారికి మోముమీద నెమ్మదిగా కొట్టుచుండెను. రాజారావు తన మందుల పెట్టెలోనుండి యొక సీసాతీసి యామె ముక్కుకడ బెట్టినాడు. సత్యవతికి మెలకువ వచ్చినది. లోనికి గ్లూకోజు ఇంజెక్షను ఇచ్చినాడు.
సుబ్బారాయుడుగా రక్కడకువచ్చి యామెను చంటిబిడ్డవలె నెత్తుకొని లోన మంచముపై పరుండ బెట్టినారు. సత్యవతి తండ్రి మెడ కౌగిలించుకొన్నది.
పెద్దాపురములో జరిగిన సంగతి నాగరత్నం అమ్మమ్మతో, తాత గారితో నిట్లు చెప్పినది.
‘రెండోరోజున మా నాన్న హోటలులోతినడం చూశాట్ట మామయ్య, ఇంటికివచ్చి మాతో చెప్పాడు. కచ్చేరీనుంచి రాత్రి ఎనిమిదిగంటలకు గాని రాలేదు మానాన్న. మామయ్య నాన్నతో ఎంతో సేపు బోధించి చెప్పాడు. నాన్నని మామయ్య చాలామాటలు అన్నాడు. మానాన్నకు ఏదో కోపంవచ్చి తిరిగి మామయ్యను నాలుగుతిట్లు తిట్టాడు. ఇంతలో మామయ్య ఉగ్రుడై లేచాడు. మానాన్నని ఇటూ అటూ రెండు లెంపకాయలు ఫెళ్లుమని కొట్టాడు. చొక్కా చేతులు పైకితీసి ‘కాసుకో నిన్ను ఈరోజున హతమార్చేస్తాను’ అన్నాడు. మామయ్యను చూసేటప్పటికి నాకే వణుకుపుట్టింది అమ్మమ్మా! మామయ్య ఎంతో పొడుగు ఎదిగిపోయినట్లే అయింది. తాతయ్యా! నువ్వు నా చిన్నతనంలో చూడిదూడను కొట్టిన పాలేరు వాణ్ణి, రాక్షసిలా ఉన్నవాణ్ణి, ఒళ్లు హూనం అయ్యేటట్లు కొట్టినప్పుడు ఉన్నావే, అల్లాగే ఉన్నాడు మామయ్య!’