Jump to content

పుట:Narayana Rao Novel.djvu/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండేమార్గాలు

359

రెండేండ్లనుండి తన బావగారు సాధుమూర్తియై సంచరించినారు. తన చిన్నక్కగారు రెండేండ్ల క్రిందట గర్భవతియైనప్పుడు ఆమె నిట్లే బాధించి పెట్టిన కష్టము ఆమె దేహము మూలమంట కదల్చివైచినందున, ఒక నెల ముందుగ బురుడువచ్చి సత్యవతి చచ్చిబ్రతికినది. బిడ్డయు బోయినది.

అది అంతయు వీరభద్రరావు గ్రహించినాడు. నాటినుండియు భార్యను పువ్వులలోనుంచి పూజించుచుండెను.

మరల నే డైదవమాసము గర్భమట సత్యవతికి. సత్యవతి చక్కని మొగము పాలిపోయి, చిక్కి కృశించి, యామె పెద్దకన్నులు మరింత పెద్దవియై భయంకరముగ నుండెను. తగుమాత్రము బొద్దుగనుండి సౌందర్యనిధియైన యామె దేహము చిక్కి, క్షయరోగపీడిత శరీరమువలె నున్నది.

నారాయణరావు చిన్నక్కగారి ప్రక్కల గూర్చున్నప్పుడు, సత్యవతి నీరసముగ నున్నను నెమ్మదిగ లేచి, జరిగి, యాతని యొడిలో దలనుంచుకొని, ‘తమ్ముడూ!’ అని అతని ఒడలు నిమిరినది. నారాయణరావు హృదయము ద్రవించిపోయినది. ఎప్పుడు దుఃఖమెరుగడు. కన్నుల నీరురాదు. లోన తరిగివేయుచున్నది. ‘అక్కయ్యా, ఈ పద్ధతి మారేటందుకు రెండు మార్గాలున్నాయి: ఒకటి నేను కైరాలో, బొంబాయిలో, ఢిల్లీలో గాంధీగారు ఉపవాసం చేసినట్లు మీ యింటిలో ఈ దెబ్బదెబ్బా ఉపవాసవ్రతం చేయడం. లేదా, నిన్ను మా యింటికి తీసుకుపోయి, బావ కాళ్ళబేరానికి వచ్చిందాకా ఉంచివేయడం. కాని యీ రెండు నీకిష్టం ఉండవు. నీకేది ఇష్టంఅయితే అది చేస్తాను. నేను నెలరోజులైనా నిరాఘాటంగా ఉపోష్యంఉంటాను. నీయిష్టం లేకుండా చేస్తే నాహృదయంలో సరియైన పవిత్రత ఉండదు; పైగా నీకు వెఱ్ఱి దుఃఖమువచ్చి యీ అపరిమిత నీరసంలో ప్రాణంపోతే ఏమి చెయ్యను? కనక నీ యిష్టం లేకుండా చెయ్యను అక్కయ్యా.’

‘ఒరే తమ్ముడూ! నువ్వు ఉపోష్యం చెయ్యవద్దు, నన్ను తీసుకొని వెళ్లావద్దు. ఆయనకు సేవచేస్తూ ఉంటాను. ప్రాణం పోతేపోతుంది. లేకపోతే ఎల్లాగురా, నేను ఇప్పుడు ఆయన్ని వదలి రావడం?’

‘ఒహో! ఏమి పతివ్రతండీ! సెబాసు! మళ్ళీ అరుంధతీ వాళ్ళూ పుట్టివచ్చారు; నాకు కోపం రావాలి అని ప్రార్థిస్తూన్నాను!’ అని యాతడు మనస్సు లో ననుకొన్నాడు.

అక్కగారికి నారింజరస మింతయిచ్చి, బలవంతాన త్రాగించి, రాజారావునకు తంతినిచ్చి నారాయణరావు బజారునకు వెళ్ళి వచ్చుచుండగా బావగారు వీరభద్రరావు హోటలులో భోజనముచేసి వచ్చుట కనుగొనెను. కరుణార్ద్రమగు చిరునవ్వాతని మోమున ఉల్కవలె మెరసిపోయినది.