పుట:Narayana Rao Novel.djvu/313

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
312
నారాయణరావు

నన్ను హేళన చేస్తున్నారు. ఎన్నిసార్లో గోదావరిలో పడిపోదామనిన్నీ, విషం పుచ్చుకుందామనిన్నీ తోచింది.’

‘ఆలాగా!’

లోకపు మెప్పుగోరి మంచి చేయుటయు, నిందకోడి చెడుచేయకుండుటయు గొప్ప కాదు. లోకమే మనశీలమును గాపాడుచున్నదా? హరిశ్చంద్రాది నాటశాలలో నీ భావములు వెల్లడించి ఈ నాటక గ్రంథకర్త లెట్టి ద్రోహమాచరించుచున్నారు! మనము మంచి చేయుట మంచికొరకు గాని, లోకము కొరకా? ఓ భరతమాతా, నీ కెట్టికళంకము తెచ్చుచున్నామమ్మా! మేము చేయు మంచి చెడ్డలు సంఘమనుకొనుదాని పై నాధారపడియున్నవికదా! మంచి కదాయని మంచిచేయుటకాదు. చెడుకదాయని మానివేయుట కాదు. హరిశ్చంద్రుడు నిజమాడిన, ప్రజలు హరిశ్చంద్రుడు సత్యమాచరించినాడని చెప్పుకొనవలెననియా? అందులకా అత డా వ్రతము పట్టుట? అని నారాయణరా వనుకొనెను.

ఆరాత్రి వారిరువురు బెజవాడమీదుగా హైదరాబాదు ప్రయాణమై పోయిరి.

హైదరాబాదునుండి నైజాముసాగరు వెళ్ళిరి. దూరమున నొక యాత్రికుల బంగాళాలో సుబ్బయ్యశాస్త్రిగా రాగినారు. నారాయణరావు రాజేశ్వరరావును కలిసికొనుటకు వెడలిపోయినాడు.

రాజేశ్వరున కుద్యోగమై పదునైదు దినములైనది. అత డందరితో, దోడి యధికారులతో, పై యధికారులతో, తాబేదారులతో మంచిగా సంచరించు చుండెను. ఆ పదునైదు దినములలోనే యాతడన్న నందరు గౌరవము జూపుచుండిరి. రాజేశ్వరరావు తోడియధికారి యొక మహ్మదీయ యువకుడున్నాడు. ఇత డొక నవాబు గారి కొడుకు. ఆ నవాబు గారికి నైజాము ప్రభుత్వములో జాల పలుకుబడి యున్నది. ఆ యువకుడు హైదరాబాదులో ఇంజనీరింగు చదువు కొన్నాడు. పలుకుబడిచే నాతని కా యుద్యోగమిప్పించి నారు.

ఆ యువకునకు, రాజేశ్వర రావునకు మిక్కుటమగు స్నేహము కలిగినది.

రాజేశ్వరరావు స్వతంత్ర ప్రేమ సంఘంలో నిజమగు సభ్యుడు గాని, స్వలాభమునకై యందు జేరలేదు. తనయం దిష్టము లేని స్త్రీ నెప్పుడు నాతడు బలవంతము చేయలేదు. తాను మోహించిన యువతి యొక నెల తరువాత నైన తన యిష్టము వేరొకనిమీద ప్రసరింపజేసినప్పు డా యువకుడు హృదయమున నిసుమంతయు నసూయపడక, ఆ యువతిని వదలి వేయువాడు; జుగుప్స నొంద లేదు. అతని హృదయ మిసుమంతయు బాధ ననుభవించలేదు. తాను పెళ్లిచేసుకొన్న భార్య పరుని గోరినచో నామె కోర్కె దీర్చుట కాతడు సంసిద్ధుడనని హృదంతరమున సంకల్పించుకొనియే యున్నాడు.