పుట:Narayana Rao Novel.djvu/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహావేశము

311

లాడుటచే వారు సేవకునిచే నాతని గెంటించివైచిరి. ఇంటికి వచ్చి భార్య వస్తువులు చూచి యేడ్చినాడు. ప్రపంచమున నెవ్వని నిక నమ్ముట! ఛీ! ఛీ! పురుషుడన్న వాడు పెళ్లి చేసుకోవాలి. పరభార్యల నపేక్షించుట ఎంత హీనము! తా నిదివరకు చేసిన పొరపాట్లున్నవి. అవి తాత్కాలికములు. కాని ఈ దారుణ మేమి? దీనికి శిక్షాస్మృతి ననుసరించి పరభార్యాపహరణము క్రింద నభియోగము గొనివచ్చి ఈ పిశాచిని, ఈ చండాలుని రక్తము పీల్చవలెను.

కాని, అభియోగము దాఖలు చేసినచో నిదివరకే తలవంపులు రానున్న తనకు మరియు తలవంపు లగును. ఆడవారివల్ల లోకాలు పాడవుచున్నవికదా!

అతడు వీధివెంట జనుచున్నప్పు డందరు తన్ను చూచి హేళనచేయుచున్నట్లు భావించుకొన్నాడు. అభియోగము చేసినచో వేలుతో చూపించి మరియు హేళనము చేయుదురేమో! మరియు దుర్భరపు బ్రతుక గును.

రాజేశ్వరరావుకు జమీందారుగారి యల్లుడగు నారాయణరావు గారు స్నేహితుడని యాతనికి దెలియును. చెన్నపట్టణము పోయి ఆయన సహాయ మడిగినచో నుపయోగించునేమో?

ఆ యాలోచన జనించిన రాత్రియే చెన్నపట్టణము వచ్చినాడు సుబ్బయ్య శాస్త్రి. తిన్నగా నారాయణరావు గారి యింటికివచ్చి నారాయణరా వింటికడ లేకపోవుటచే నొక హోటలునకు బోయి సామానచ్చట బెట్టి, స్నానమాచరించి, భోజనము చేసి నారాయణరావు గారి మేడకు వచ్చెను. అప్పుడే వచ్చి నారాయణరావు భోజనముకడ కూర్చున్నాడు.

నారాయణరావు భోజనము చేసి యీవలకు వచ్చుటతోడనే, సుబ్బయ్య శాస్త్రి గారు లేచి నమస్కరించెను. నారాయణరావు సుబ్బయ్యశాస్త్రి గారి నెరుంగును. ఆయన వచ్చినపని నిమేషమున నాతని కవగతమైపోయినది.

‘సుబ్బయ్య శాస్త్రి గారూ! నమస్కారము. దయచేయండి’ అని యాతడన్నాడు.

సుబ్బయ్యశాస్త్రి గారికి కన్నుల నీరుతిరిగినది. నారాయణరావు తెల్లబోయినాడు.

‘అదేమిటండీ శాస్త్రులుగారూ! మీరు వచ్చినపని తెలుస్తూనేవుంది. వాళ్ళు తిరిగి హైదరాబాదు వెళ్ళినారట. అచ్చట అతని కేదియో యుద్యోగము దొరికినదట. నన్ను వెళ్ళి ప్రయత్నము చేయమని మా యుద్దేశమైతే నేనీ రాత్రి బయలుదేరి వెళ్తాను. ఇదివరకే అనుకుంటున్నాను. కాని అతను దేశాలు తిరుగుతున్నాడు. మీరు కూడా వచ్చి హైదరాబాదులో ఉండండి. భగవంతుడు మన ప్రయత్నం నెరవేర్చకమానడు.’

‘చిత్తం. నేను నాశనం అయిపోయానండి. ఈ ఆరు నెలలు నేను పడిన బాధ నా విరోధికైనా వద్దండి. మర్యాదగా బ్రతికినవాణ్ణి. ప్రజలు అన్ని విధాల