పుట:Narayana Rao Novel.djvu/311

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
310
నారాయణరావు

అట్టియెడ, పురుషునకును వనితకును స్నేహ మేల పనికిరాదు? ఎట్టి సత్పురుషుడైనను ఒక బాలికతో నెంత నిర్మలస్నేహాన మెలగినను గుసగుసలు, తేరిపార చూపులు, పెదవి విరుపులు. ఒహో!

యౌవనమందున్న స్త్రీ పురుషులకు మాత్రము పవిత్ర స్నేహము సాధ్యమేల కారాదు?

శ్యామసుందరితో దన స్నేహము పవిత్రమైనదా? ఏ మూలమూలలనైన పవిత్రతకు దూరమగు నర్థ మేమైన గలదా?

మోహావేశము

రాజేశ్వరరావు, పుష్పశీలయు నీ ఆరునెలలు మోహావేశపరవశులయి తిరిగినారు. రాజమహేంద్రవరమునుండి హైదరాబాదు, హైదరాబాదునుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి కలకత్తా, కలకత్తా నుండి బొంబాయి. రెండవతరగతిలో నిరువురకుమాత్రముండు పెట్టెపుచ్చుకొనువాడు. స్టేషనుమాష్టరు చేతిలో రెండు, గార్డు చేతిలో రెండు లంచము. అంతే! అతడే మహారాజు!

అజంతా మొదలగు ప్రదేశములకు గూడ నాతడు వెళ్లెను. అంతటను బంగాళాలు మకాము. ఎప్పుడు పుష్పశీలయే యెదుట నుండవలెను. ఎప్పుడు మోహావేశమే. పుష్పశీల కా యారునెలల కాలము తృటిలో వెళ్లిపోయినది. రాజేశ్వరు డామెను పూవువలె చూచుకొన్నాడు. మహారాణివలె నాదరించినాడు. ఆమె యేది కోరిన నది ఇచ్చినాడు. ఆరు నెలలు తిరిగి తిరిగి వారిరువురు హైదరాబాదు వచ్చినారు. అచ్చట నాతడు ఉద్యోగమునకై ప్రయత్నింప నారంభించెను.

రాజేశ్వరునకు దూరపుచుట్టమగు బందరు నాయుడుగా రొక రచట పెద్ద ఇంజనీయరు. ఆయన రాజేశ్వరు నాదరించి నెలకు నూటయేబది మొగలాయి రూకల జీతముతో నారంభించి సంవత్సరమునకు పది చొప్పున రెండువందల యేబదివరకు హెచ్చు పద్ధతిని, సహాయ ఇంజనీయరుగా నవాబు గారు కట్టించు నైజాము సాగర్ అను పెద్ద చెరువున బనిచేయుట కేర్పరచెను.

పుష్పశీలపై నెయ్యమున రాజేశ్వరుడుగూడ మాంసాదుల వర్షించెను. ఆమెయు భార్యవలె సంచరింపదొడంగెను. తాను కాపుపిల్లనైతినని యామె భావించుకొన్నది. వారిద్ద రా చెరువులో బనిచేయు నింజనీర్లకై యుద్దేశింపబడిన యొక బంగాళాలో కాపురముండిరి.

సుబ్బయ్యశాస్త్రిగారికి మతిపోయినది. స్వతంత్ర ప్రేమ సంఘము నాయన నొవ్వ తిట్టినాడు; అగ్నియైనాడు. ప్రపంచము మ్రింగివేయుద మన్నంత కోపము వచ్చినది. రాజేశ్వరరా వింటికిబోయి యాతని వృద్దమాతపై మండిపడి దుర్భాష