పుట:Narayana Rao Novel.djvu/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహావేశము

313

పుష్పశీలయు దానును రాజమహేంద్రవరమునుండి బయలు దేరినప్పుడే యాతడు సుబ్బయ్య శాస్త్రి గారి కిట్టి యుత్తరము వ్రాసి తపాలులో వేసినాడు.

‘ఆర్యా! మనం ఒక విచిత్ర సంఘంలో చేరిన సభ్యులం. ఆ సంఘంలో ఉన్న నియమాలు జరుపుటకు మీరు ప్రమాణం చేశారు. ఇంక ఆ యుద్దేశాలేమిటి:

1. ఆడవాళ్ళు ఇన్ని యుగాలనించీ మగవాళ్ళకు బానిసలై యుండుట చేత, వారి బానిసత్వం తొలగ చేయుట, వారికి పురుషునకున్న సర్వ స్వతంత్రాలు ఇచ్చుట.

2. వివాహము అన్నది వ్యక్తిత్వాన్ని చంపి మానవుల్ని సంఘానికి బానిసల్ని చేస్తూవున్నది కాబట్టిన్నీ, ఈ వివాహం అనే సంస్థ పురుషుడు స్త్రీని తనకు బానిస చేసుకోడానికే యేర్పాటు చేసుకున్నది కాబట్టిన్నీ, సదరు వివాహం అనే సంస్థను రూపుమాపి దాని స్థానే స్త్రీ పురుషులకు సమానహక్కుల్ని యిచ్చే సంస్థను యేర్పాటు చేయడానికిన్నీ.

3. ఉద్దేశాల్ని ఆచరణలో పెట్టడానికి మన సంఘాచార్యులగు తిరుపతిరావుగారు మనకు దినచర్య సూత్రాలు కొన్ని నియమించారుకదా: (ఎ) ఎప్పటి కప్పుడు కనబడినవారి కెల్ల మన సంఘోద్దేశాలు చెప్పి సభ్యులను చేర్చుకోవడం. (బి) వివాహము చేసికొనని పురుషుడు వనితతో, వనిత పురుషునితో స్నేహమున కలిసియుండవలెను. వారు ప్రేమకొరకై యట్లున్న మరియు నుత్తమము. (సి) వివాహము చేసికొన్న సభ్యులు తమ భార్యలకు స్వాతంత్య్రమిచ్చి వారి యిష్టానుసారము సంచరించుటకు సమ్మతింపవలెను.

ఈ మూడు ముఖ్య సూత్రాలను తమరు గమనించవలెనని ప్రార్థిస్తున్నాను. నేను మీ భార్యయైన పుష్పశీలాదేవిని ప్రేమించాను. ఆమె నన్ను ప్రేమించినది. కాబట్టి యీ ప్రేమ సాఫల్యం చేసుకోటానికి మేము దేశాలు తిరుగుతున్నాము. మీ ప్రమాణం జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు పుష్పశీల నాపై ప్రేమను మరుస్తుందో ఆనాడు తిరిగి మీయింటికి వస్తుంది. పుష్పశీలకూడా నా ఉద్దేశమే బలపరుస్తున్నది. అందుకనే ఆమెకూడా ఈ ఉత్తరంలో సంతకం చేస్తూ ఉన్నది.

మీ ప్రియమిత్రుడు రాజేశ్వర రావు.

పై ఉత్తరం అంతా నా యిష్టం పైన కూడా వ్రాయబడింది.

మీ మిత్రురాలు పుష్పశీల.

ఈ ఉత్తరం చూచి తల బ్రద్దలుకొట్టుకున్నాడు సుబ్బయ్య శాస్త్రి. ఆ ఉత్తరం సంగతి ఆలోచించుకొనుచు సుబ్బయ్యశాస్త్రిగారు నిట్టూర్పు నించుచుండ నారాయణరావు రాజేశ్వరు డింటలేడనియు, బనికై బోయి నాడనియు తెలుసుకొన్నాడు. నారాయణరావు గబగబ నడచుచు కూలీల, గుమాస్తాల, చిన్న యుద్యోగుల నడుగుచు రాజేశ్వరరావు పని చేయు స్థలమునకు బోయెను.