పుట:Narayana Rao Novel.djvu/307

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
306
నా రా య ణ రా వు

దోషరహితమైన జీవితము గడపుటే సత్యము. అట్టి సత్యవ్రతము చేసిననేకాని సత్య స్వరూపుడగు భగవంతునితో నైక్యమందలేము. అట్టి సత్యవ్రత మొనర్చుటకు బ్రేమ ముఖ్యసూత్రమన్నావు. నాచే రాధాకృష్ణ గారి గ్రంథములు, వివేకానందుని యుపన్యాసములు, గాంధీ జీవితచరిత్రమూ చదివించావు. నాహృదయంలో మానవసేవ చేయుట పరమపవిత్ర మైనదనిన్నీ, మోక్షదాయకమైన దనిన్నీ తోచింది...’

ఆమె కంఠము రుద్దమైనది. ఆమె నేత్రాంచలములు తడియైనవి. ఆమె మోమున ప్రేమశాంతులు తళుకుమనుచున్నవి. అపు డా బాలిక __యా యమెరికను ప్రసిద్ధ వైద్యుని కొమార్తె, యా సౌందర్యనిధి లియొనారా రామచంద్రుని బిగ్గ కవుగిలించుకొని యాతని హృదయములో మోమునుంచి,

‘నీవు నా గురువువు. నే నింతటినుంచి బ్రహ్మచారిణినై మానవసేవ చేయుటకు సంకల్పించుకొన్నాను. అమెరికాకు నేను చిహ్నాన్ని, కాని నన్ను దగ్ధము చేయు నా యీ ప్రేమను వదలి వేయాలి. ప్రియతమా! నా ప్రభూ! నన్నొకసారి పాలించుకో. మొదలూ తుదీ ఏకమైన ఆనందము నాకియ్యి. నన్నీ ఒక్క ముహూర్త కాలమూ భార్య నొనరించుకో. ఈ యొక్క నిమేషము నీలో ఐక్యమైపోవనీ’ అన్నది. ఆమె మాట లస్పష్టములై, కాకలీకూజితములై, యా సంధ్య వెలుగులలో గలిసిపోయినవి.

రామచంద్రుడు నిశ్చేష్టుడై, చైతన్యరహితుడైనాడు. ఆతని మోము వెల వెలబోయినది. లియొనారాను చుట్టిన యాతని చేతులు వాలిపోయినవి.

‘ప్రభూ, నా కోర్కె పాలింపవా?’

‘ఆమె మోము హృదయముతరుగునట్టి బాధతో నిండినది. ఆమె కన్నుల సంతతజల ధారలు నయాగరాలైనవి.

‘తీరని యీ కోర్కెతో నా మనస్సు శాంతి లేక దహించుకొనిపోవలసినదేనా? నాకు సేవకై యనుజ్ఞ నీ వీయదలచుకొనలేదా? అందమగు నాయీబ్రతుకును విషాదాంతము చేయదలచినావా, నా ప్రాణప్రియా! నీ వేల నా జీవిత చరిత్రలో నొక పాత్ర వయ్యావు! అహో!’

రామచంద్రుడు కరిగిపోయినాడు. అతని లోకాలు సురిగిపోయినవి. ఈమె కింత ప్రేమ యున్నదా! తాను పాపమాచరించుట లేదా?

లియోనారా ఇంకను గట్టిగా నదిమికొన్నది. ఆమె మోమెత్తి, అతని హృదయమున తన హృదయ మదిమి పెదవులు ముద్దిడుటకు అతని మోమొ వంచినది.

ఇరువురు పుల్కరించిపోయినారు.

ఆ సంధ్యాకాంతులలో, పక్షులు కలస్వనములలో, తారకలు స్పష్టకాంతుల వర్షించు శుభ ముహూర్తాన ప్రకృతి గంభీర సౌందర్యాన నృత్యము చేయునాచోట, ఒక్క విచిత్ర ప్రేమ సంశ్లేషావేశము సంఘటించి పోయినది.