పుట:Narayana Rao Novel.djvu/284

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
283
క్లి ష్ట స మ స్య

వేసినవారి కొకబహుమతి నూరు రూపాయలు, ఆంధ్ర చిత్రకారకులలో నుత్తమ చిత్రకారులకు రెండు బహుమతులు నూరురూప్యముల చొప్పన నిచ్చిరి.

ఆ యేడు ప్రచురింపబడిన నవీనగ్రంథములలోను నుత్తమ గ్రంథమునకు ఐదునూర్ల రూపాయలు బహుమతి నిచ్చినారు.

ఉత్తమ కథానికమునకు రెండువందలు, ఉత్తమ పద్యకావ్యమునకు రెండువందలు, ఉత్తమ గీతికా కావ్యమునకు రెండువందల రూపికలు బహుమతుల నిచ్చినారు. రెండవ తరగతి బహుమతులుగా వెండి పెట్టెలు, బంగారుపతకాలు, వెండిగిన్నెలు అయిదువందల రూపికల ఖరీదుగలవి అర్పించినారు.

నవీనకవుల ఛాయాచిత్రములు, వారి వారి కవిత్వములలో నొక్కొక్క పాటతోగాని పద్యముతో గాని చేర్చి ఒక గ్రంథము ప్రచురించుటకు నారాయణరా వేర్పాటుచేసెను.

నాటకమునకు పంతొమ్మిదివందల రూపాయలు వచ్చినవి. భోజనమునకు, ఫలహారములకు నారువందలైనవి. అద్దెలకు మూడువందలు. అచ్చులకు నూటయేబది, దండలు ఛాయాచిత్రములకు నూటయేబది రూపాయలు, భాగవతులకు, తోలుబొమ్మలవారికి, బొబ్బిలిపాటవారికి, రానుపోను ఖర్చులకు, బహుమతులకు నాలుగువందలైనవి. మొత్తము చిల్లర ఖర్చులతో నాలుగువేలు సమావేశమునకు ఖర్చయినది. నారాయణరావునకు కొందరికవుల రానుపోను ఖర్చులతో చేతి సొమ్ము మూడువందలైనది. ప్రదర్శనమునకు రెండువందల పాతికరూపాయలు వచ్చినవి. మొత్తముమీద సొమ్ము మిగులలేదు. కాని ఇట్టి ఉత్కృష్టమైన సభా కార్యక్రమము ఎప్పుడు నెక్కడ జరుగలేదని లోకమంతయు ననుకొన్నారు.

నారాయణరా వేదో యొకపని కల్పించుకొని తనహృదయమును గలంచుచున్న వేదన మఱచిపోవ యత్నించుచుండెను. తన మామగారు మొన్న వచ్చి క్రిస్టమసుకు శారదను కొత్తపేట పంపవలయునని సుబ్బారాయుడుగారు వ్రాసినట్లును, దానట్లు బంపుటకు నిశ్చయించుకొంటిననియు దెలిపినారు. శారదను కొత్తపేట నుండి తాను చెన్నపురి తీసికొనిరావలయునట. ఆమె పరీక్షకు వెళుచుండుటచే దా నామెకు పాఠములు బోధింపవలయునట. ఆమె మదరసులో జదివి రాజమహేంద్రవరములో జరుగు పరీక్షకు 1929 మార్చి నెలలో వెడలునట, తన మామగారు తీసికొనివెళ్లుదురట.

ఆమెతో నెట్లు తాను కలిసియుండుట? పులిమీద పుట్ర యనునట్లామెకు గురువై బోధించుటా? ఇంతకు నా బాలిక యొప్పుకొనునా? తండ్రి మాట యన్న తప్పదు గాబోలు. ఆమెయే తల్లితోడ జెప్పి యీ మార్గ మేర్పరచినదేమో? అంత యదృష్టమా! ఇది మామగారి యాలోచనయే యగును. తప్పదు. తమ యిద్దరి వైఖరియు దెలిసి యిట్లాచరించలేదుగదా? తనపై నింత ప్రేమ యేలనో మామగారికి? ఆయన అమృతమూర్తి.