284
నా రా య ణ రా వు
దివ్య సౌందర్యగాత్రయగు నా బాలిక యిట్లాచరించినదేమి? ఆమె దుష్ట హృదయ కాలేదుగద! ఛీ! తానెంత దుర్మార్గుడో! పవిత్రచరిత్ర లగు భారత నారీమణులలో నొకరితనైన తుచ్ఛుడగు పురుషు డనుమానింపదగడు. తన యంతరాత్మ యా బాలిక పవిత్రచరిత్ర యని పాటలు పాడుకొన్నదే. పోనిమ్ము, తన ప్రేమ యంత గంభీరమై, నిర్మలమై ప్రవహించుచుండ తన చిన్నారిభార్య, తన ప్రేమమందిర పూజాపీఠస్థదేవి తన్ను తిరిగి ప్రేమింపదా?
ఆ బాలికను బ్రేమచే ముంచివైచి, ఆమెకు దన హృదయకమలమున కమలాబాల నొనర్చుకొనవలయును.
ఆమె హృదయం నొవ్వకుండా సంచరింపగలనా? మేమిద్దరమూ ఇచ్చట ఈ సముద్రం ఒడ్డున ఉండిపోగలమా!
- ‘నీకు నాకూ జోడు అయితే
- మల్లెపూల తెప్పగట్టి
- తెప్పమీద తేలిపోదం పదరా’
అన్నట్లు మా దివ్య ప్రణయాన్ని తెప్పగట్టి తేలిపోలేమా?’ అతని కన్నుల నీరు తిరిగినది.
తన ప్రేమ మవ్యాజమేనా యని నారాయణరావు హృదయములో బ్రశ్నించుకొన్నాడు. ప్రేమలేని పశువుకన్న తుచ్ఛకామియగు మానవుడు మేలని వివేకానందు డనినాడే! కళంకపూర్ణమగు బ్రేమనైన నెరిగిన వ్యక్తియే, ఏనాటికైన భక్తి నెరుంగ గలడని గదా వివేకానందమహర్షి యనినది.
కావున సకామమగు ప్రేమయు యుక్తమేనని యర్థమిచ్చునుగద. తుదకివి యన్నియు నీశ్వరప్రేమగా పరిణమించి చరితార్థములగునని నారాయణుడు భావించుకొన్నాడు.
భార్య యెట్లును తనతో సంసారమున కిచ్చగించుటలేదుగదా! అవకాశము దొరికినందుకు తా నీ సమయముననే యన్నియు వదలి యే హృషీకేశము నకో, యే హిమాలయ నగశ్రేణికో పోయి, యచ్చట గురుమహారాజును వెదకి జ్ఞానవిద్య నేర్చికొని యేల తపస్సు చేయకూడదు? ఏనాటికైన ఏజన్మమునకైన నా మార్గమునే వెదుకవలయునుగదా? క్షణికమై, యనిత్యమైన యీ నీచపుం బ్రతుకు ఏల వదలలేము? రాళ్లను గాలికన్న తేలికచేసి యాకాశమున కెగుర వేయుట యెట్టిదో యీ జన్మమును దరింపజేయు ప్రయత్నమట్టిది. తానంతటి యదృష్టవంతుడా? ఛీ! తన దురదృష్టపు జీవితమునకు వెలుగు పొడచూపు మార్గము గోచరించినను దాని ననుసరించు ధైర్యము చాలకున్నదే! రామచంద్రా! భక్తపరాయణా! నీదే భారము.
ఇంతలో పరమేశ్వరమూర్తి యచ్చటకు వచ్చినాడు. వారిరువురు సముద్ర తీరమున గలిసికొనవలెనను సంకేత మేర్పరచుకొన్నప్పుడు, యువతీ కళాశాల కెదురుగ కలసికొందురు.