పుట:Narayana Rao Novel.djvu/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆం ధ్ర న వ క వి స మి తి

281

తెనుగును శాసించకండి. అప్పుడే రెండురకాల భాషలు__గ్రాంథికం, వ్యావహారికం వచ్చాయి. ఈ రెంటికి గట్టులు దూరం అవుతున్నాయి. ఏలాగో వంతెన కట్టాము. ఇక కట్టలేనంతదూరం అయితే ఇంకో కొత్తభాష తయారవుతుంది. ఆ భాష సంస్కృతంలా నిధి కావచ్చును అనుకుంటారేమో. ఆ అదృష్టం సంస్కృతం దివ్యభాష గనుక దానికి పట్టింది. కాని ప్రతిదానికీ పట్టదు.’

ఈ రీతిగా మాట్లాడినాడు.

వ్యావహారికమును కావ్యభాష యనినారు. కాదు వచనకావ్యములు వ్యావహారికములోననే యుండవలెనని మరికొందరు వాదించిరి. కావ్యలక్షణాలు ఉండవలెను. కాని, భాష ఉపాధి. అదియును కావ్యానికి ముఖ్యాంగము కాబట్టి ఏ భాషనైనా ఉపయోగించవచ్చునని, అది కావ్యములో లీనమైపోవలెనని తీర్మానము జయమందినది. నారాయణరావు చిత్రకళను గురించి మాట్లాడినాడు చిత్రకళా మహాసభలో.

‘కళ ఆనందస్వరూపం. ఒక వ్యక్తిలో జనించిన ఆనందం కళాస్వరూపంతో వ్యక్తం అవును. ఆ వ్యక్తమైన కళ సూచనమాత్రం కాక , సంపూర్ణముగా ఆనందమును వ్యక్తీకరించాలి. ఆనందం ఎలా కలుగుతుంది? సృష్టి మనదృష్టి పథములోనికి వచ్చినప్పుడు అనగా సృష్టిలో శ్రుతిపూర్ణమగు విషయం నీ దృష్టిపథాన్ని పడినప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. దివ్యమై పరబ్రహ్మ స్వరూపమైనది ఆది శ్రుతి. ఆ శ్రుతి ప్రకృతిలో అనేకరకములగు శ్రుతులుగా వ్యక్తమవుతుంది. రంగులు రంగుల కలయిక, స్వరములు వాని కలయిక, వస్తువులు వాని కలయిక, పరిమళాలు వాని కలయిక, రేఖలూ వాని కలయిక, హృదయములు, జీవితములు, మనస్సులు, చరిత్రలు వీని కలయికలు, ఆత్మలు వాని కలయిక ఇవి శ్రుతిస్వరూపాలవుతవి.

‘ప్రపంచంలో వ్యక్తుల జీవితాలు భిన్న భిన్న శ్రుతులతో ఉంటవి. ఎవని శ్రుతినిబట్టి వానికి తగిన ఆనందం కలుగుతుంది.’

‘ఆ ఆనందం వ్యక్తీకరించే శక్తి పూర్వకర్మ సముపార్జితం. అలా వ్యక్తీకరించలేనివాడు ఆ వ్యక్తీకరణము గోచరించినప్పు డానందిస్తాడు.’

‘వ్యక్తీకరించగలవాడు స్రష్ట. అట్టి కళాసృష్టిని చూచి ఆనందించువాడు కళాభిజ్ఞుడు.’

‘సంగీతహృదయంగల వ్యక్తి ఒక చిన్న సెలయేటి పతనంలో సంగీతం విన్నాడు అనుకోండి. అతని హృదయంలో ఆనందం పుట్టింది. ప్రశ్రవణగానసదృశమగు పాట రచించినాడతడు. అది విని మన మానందిస్తాము.’

‘ఒక కొండ, కొండ ప్రక్క మహానది, నీలాకాశం, సాయంత్రపు బంతి రంగు మేఘాలు ఒక చిత్రకారుడు చూసినాడనుకోండి. అతనికి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం ఒక కొండను, మహానదిని, మేఘాలను చిత్రించి వ్యక్తీకరిస్తాడు. ప్రకృతిలో అపశ్రుతిభూయిష్టములైనవానిని చెట్టులు, చేమలు