పుట:Narayana Rao Novel.djvu/281

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
280
నా రా య ణ రా వు

సాభినయముగ బాడి వినిపించెను. అతిథులందఱకు హిందూ యువజన సమాజ భవనమున ముప్పొద్దుల షడ్రసోపేత భోజనములు, ఫలహారములు నమర్చిరి.

అధ్యక్షులవారు మధురముగ, గంభీరముగ ఉపన్యాసము గావించినారు. కవిత్వము జీవితమూలము కదిపిరావలెను. పైనుంచి తెచ్చిన అలంకారము కారాదు. కవి బ్రతుకులో భాగమై అది మొలకెత్తవలెను. ఈరీతి వారు గంగాప్రవాహమువోలె, సముద్ర కెరటములరీతి నుపన్యాసము లిచ్చినారు.

భావకవిత్వము అనుమాట పనికిరాదన్నారు గొందరు. భావములేని కవిత్వం ఏది? ఆ పదము తప్పక తీసివేయుడని ఉపదేశించిరి. కాని భావమన అర్థముకాదు. రసస్వరూపమైన భావమే సరిఅయిన పదమనియు, భావమన హృదయము, మనస్సు అనియు, భావజ్ఞు డా యర్థమును గోచరింప జేయుననియు, కవిజీవితమును ప్రతిఫలింపజేసికొన్న కావ్యము భావకవిత్వమని కొందరు వాదించిరి. అందరు భావకవిత్వమన్న (సబ్జెక్టివ్) కవియే నాయకుడైన కవిత్వమనిరి.

ఇరువురు భారత భాగవతములు పూర్ణకవిత్వం కాదన్నారు. సంస్కృతమునుండి ఆంధ్రీకరణము చేసినంత మాత్రమున అది కవిత్వమా యనిరి.

కాని ఆ యిరువురను ఖండించి మనల మన మెంతమెచ్చుకొనుచున్నను భారత భాగవతాది మహాగ్రంథకర్త లవతారమూర్తులని పూజింపవలెనన్నారందరు.

పాటలు వ్రాయవచ్చునన్నారు. పాటలును కవిత్వమని ఒప్పుకొన్నారు.

ఇక నెట్టిభాష ఉపయోగించవలెనన్న ప్రశ్న వచ్చినది. వ్యాకరణ యుక్తమగుభాష నుపయోగించదలచిన వారు పద్యములకు, పాటలకు నుపయోగింపవచ్చుననియు, వచనగ్రంథములకు దప్పక వ్యావహారికమే యుత్తమమనియు వచించినారు.

పరమేశ్వరు డిట్లు వాదించినాడు: ‘భాష పెరుగుతుంది. భాషకూడా ఒక వ్యక్తి. భాషకూ పుట్టుక, వృద్ధి, చావు అని మూడు స్థితులున్నాయి. ప్రపంచంలో ఎన్నోభాషలు పుట్టాయి, పెరిగాయి, నశించాయి. కొన్ని చనిపోయినచెట్టు, రాయి, లోహము మొదలయినవి శిల్పరూపముతో, నాణెములును నగలు మొదలయిన రూపాలతో జీవించిఉన్నట్లు సలహా భాషలక్రింద జీవించి ఉండవచ్చును. కాని అవి నిధులు, జీవభాషలు మాత్రముకావు. సంస్కృతం చూడండి అనేక వేల సంవత్సరాలు జీవించింది. నేడు మహానిధియైఉన్నది. అలాగే లాటిను, గ్రీకు, హేబ్రూ మొదలగు భాషలు. మీరు ఎప్పుడు భాష ఎదుగులేకుండా వ్యాకరణం ఏర్పాటుచేసి శాసిస్తారో అప్పటినుంచి వృద్ధి పొందడం మానివేస్తుందేమో. అలాగే సంస్కృతాన్ని శాసించగానే ప్రాకృతం వచ్చింది. అది శాసించగానే పాలీవచ్చింది. అది శాసించబడగానే వంగభాష, బిహారీభాష, ఒరియా, హిందీ భాష మొదలైన భాషలు వచ్చాయి. అలాగే