పుట:Narayana Rao Novel.djvu/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

నా రా య ణ రా వు

ఈ క్రొత్తకవిత్వానికి మార్గదర్శకులు గురజాడ అప్పారావుకవి. బొబ్బిలిపాట అదీ చూడండి. ఎంత మాధుర్యంగా ఉంటాయో! కాబట్టి క్రొత్తమార్గాలు తీయండయ్యా అన్నారు. తమ భావాల్ని, తమ ప్రేమనీ ఆశ్రయించి వ్రాసేవారు, జానపదుల జీవితాల్ని దర్శింపచేసేవారు, పురాతన ఆంధ్రుల మహాచరిత్రలు స్మరింపచేసి పుల్కరింపులు కలుగజేసేవారు__ఈరకాలుగా ఉన్నా రీనాటి కవులు.


౧౯ ( 19 )

ఆంధ్ర నవకవి సమితి

‘ఆంధ్ర నవకవుల కూటమి’ అని పెద్దఅక్షరములతో పచ్చయప్ప కళాశాల సింహద్వారముపై పెద్దఅట్ట కట్టినారు. మధ్య సభామందిరమును, వేదికయు మనోహరముగ నలంకరింపబడినవి. అలంకారాది సమస్త యాజమాన్యము నారాయణరావు నెత్తిపైన బడినది. వరదరాజస్వామివారు అధ్యక్షులు. ఆహ్వాన సంఘాధ్యక్షులు ఆంజనేయకవి, ఆహ్వాన కార్యదర్శి నారాయణరావు, పరమేశ్వరమూర్తి, రోహిణీదేవి మొదలగువారు ఆహ్వానసంఘ సభ్యులు. అనేక మంది కళాశాలా విద్యార్థులను బ్రోగుచేసి, వారలకు ఉత్సాహము గఱపి నారాయణరావు కార్యక్రమమంతయు విచిత్రముగ నొనగూర్చెను.

కూటమి మూడురోజులు. సమస్తమగుఖర్చులకు నారాయణరావు మున్నూరు రూపాయలు చందావేసెను. జమీందారుగారు నూరురూపాయలిచ్చిరి. నాగేశ్వరరాయలు నూరు, అల్లాడి కృష్ణస్వామయ్య గారు నూరురూపాయలు, ఇంకను వకీళ్ళు, షాహుకార్లు మొదలైనవారందరు చందాలు వేసినారు. సుమారు రెండువేల రూపాయలు ప్రోగుచేసి నారాయణరావు ఆహ్వానసంఘము వారికిచ్చి, సరళను, యువకవియు భారతీ పత్రికాస్థానములో వ్రాయసకాడునగు రామలింగరావును గోశాధిపతులజేసి, జాగ్రత్తయని వారికప్పగించినాడు.

సమయములో సమయమని చిత్రకళా ప్రదర్శనము, కవుల ఛాయాచిత్ర ప్రదర్శనము, నవీనకవుల ముద్రితా౽ముద్రిత గ్రంథముల ప్రదర్శనము నేర్పాటు చేసెను. చిత్రకళాది ప్రదర్శనములకు గళాహృదయుడగు కజిన్సుపండితుని నేతగా నాహ్వానించెను.

ధనాభావముచే సభలకు రాజాలరని యెంచిన కవులకు రానుపోను ఖర్చు లీయబడునని తెలియజేయుచు తానే తన స్వంతములోనుంచి ధనమును బంపినాడు.

ఆహ్వానము లచ్చువేయించినారు. కార్యక్రమములు ముద్రించినారు. ధనము లోటగునేమో, తనకు మించిన ఖర్చు తగులుబాటగునేమో యని యువకుల గొందరిని నాటకమాడ నేర్పరచినాడు.