పుట:Narayana Rao Novel.djvu/278

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
277
ఆంధ్రులు డాంభికులు

పద్యాలలో ఉన్నాయి. భారతం, భాగవతం, ప్రబంధాలు అవి ఏమిటో తర్వాత చెబుతా. ఆ పద్యాలతోపాటు గద్యమూ ఉన్నది. నన్నయభట్టు భారతం వ్రాసిన కవులలో మొదటికవి. తెలిసివున్నంతవరకు ఆంధ్రభాషలో గ్రంథము వ్రాసిన మొదటికవి. ‘వాగనుశాసనుడు’ అని పేరు ఆయనకు. ఆయన సంస్కృతంలో తెలుగుభాషను విధిస్తూ వ్యాకరణం వ్రాశారు. తర్వాత చాలమంది వ్యాకరణాలు వ్రాశారు అప్పకవి మొదలైనవాళ్ళు. ఆ మొదటి వ్యాకరణాన్ని అనుసరిస్తూ ఏదో కవిస్వతంత్రాలు అక్కడక్కడ చూపిస్తూ తర్వాత కవులంతా ఆ వ్యాకరణాన్ని అనుసరించారు. కాని 1850 దాటేవరకు తెలుగులో వచనగ్రంథం సరియైంది ఒకటి పుట్టలేదు. చిన్నయసూరి, వచన నన్నయ అయ్యాడు. బాలవ్యాకరణం వ్రాశాడు. ఆయన నీతిచంద్రిక అని పంచతంత్రాన్ని తెలుగువచనంలో భాషాంతరీకరణంచేస్తూ పూర్వగ్రంథాలలో ఉండే గద్యభాషే వ్రాశాడు. వీరేశలింగకవి, చిలకమర్తి లక్ష్మీనృసింహకవి ఇంకా అనేకు లా భాషను అనుసరించారు. దానికి గ్రాంథికభాష లేక వ్యాకరణయుక్తమైన భాష అని అంటారు.

రాజా: అబ్బ! గుక్కతిప్పకుండా ఒక్కబిగిని ఉపన్యాసం ఇచ్చాడు!

పర: కాని 1914 ఆప్రాంతాల్ని ఒక ఉద్యమం బయలు దేరింది. గురజాడ అప్పరాయకవి, సెట్టి లక్ష్మీనరసింహకవి మొదలైనవారు దానికి మొదటివారు. గిడుగురామమూర్తిగారు ఆ వాదానికి అర్జునుడు. వాళ్ళనేది ఏమిటి? పద్యాలమాట అటుంచండి. కాని పూర్వం నుంచి ఉత్తమతరగతులవాళ్ళు ఉపయోగించిన భాష మనకు ఆదర్శం అవ్వాలి వచనరచనకు, ఇంగ్లీషు భాష వచనం ఎప్పటికప్పటికి రాజసభలో మాటాలాడుటబట్టి మారుతూ ఉంటుంది. మనదేశంలో ఉత్తమకులాల భాషనుబట్టి మార్చుకోవాలి. లేకపోతే భాష ఎదగడం మానుతుంది. ఎదుగుట మానితే చచ్చిపోతుంది. భాషను రైలుపట్టాల మీద నడువమనకూడదు. భాష ఒక వ్యక్తి , ఒక ఆత్మ. అది యుగాలు బ్రతకాలి. అనేక యుగాలు బ్రతికి ప్రాణము వదిలిందికాబట్టే సంస్కృతం మహానిధి అయింది. వేదభాష వేరు, పురాణభాష వేరు, నాటకభాష వేరు. ఊరికే ఎదిగి హిమాలయాన్నికూడా మించాలి భాష. వ్యావహారికంలో ఉండే భాషే అలాగ ఎదుగుతూంది. ఆ భాషే మన వచనభాష చెయ్యాలి అని వాదిస్తున్నారు.

రాజా: రెండవ ఉపన్యాసం అయింది. ఇంకా!

పర: పూర్వకవులు మహారాజులను నాయకుల్నిచేసి, మహారాణులను నాయికలను జేసి గ్రంథాలను సృష్టించారు. కాలాన్ని బట్టి శృంగారం ముఖ్యరసం చేశారు. వారు వ్రాసిన పురాణాలు, మహాగ్రంథాలు, ప్రబంధాలు బాగానే ఉన్నవి. ఇంకా అవే అనుకరిస్తే పేలవమైపోతాయి అని యువకులు క్రొత్త మార్గాలు తీశారు. ఇంగ్లీషుభాష ఒకటి చాలా ఉద్బోధం కలిగించింది.