Jump to content

పుట:Narayana Rao Novel.djvu/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగన్మోహనుని పెండ్లి

265

చేయవలెనని కుతూహలముకలిగి యాంధ్రదేశమంతయు గాలించుచుండ బాలిక రజస్వలయైనది. ఇంతలో జగన్మోహనుని సంబంధము వారికి దెలియవచ్చినది. బాలిక చెన్నపట్టణమున మిషనరీల పాఠశాలలో నాల్గవఫారము చదువుచున్నది. అందమైన పిల్ల. అధునాతన నవనాగరితాభిప్రాయములు పూర్తిగా నలవరచుకున్న బాలిక.

జగన్మోహనరా వా బాలికను జూచి, యామెతో మాట్లాడినాడు. ఇరువురకు పరస్పరము నిష్టము కుదిరినది.

సంబంధము నిశ్చయమై, ఆ సంవత్సరము మాఘమాసములో ముహూర్త మేర్పరచినారు. ముహూర్తము దగ్గరకు వచ్చినది.

‘వీరేశలింగం పంతులుగారు ఆంధ్రదేశ నాయకమణిగా ప్రఖ్యాతి వహించినారు. ప్రసిద్ధమైన కార్యాలు చేశారు. అయితే ఇప్పుడేమన్నా పని జరుగుతోందాండి? ఆయన ఏవి తప్పులని గొడ్డలిపుచ్చుకు కొట్టారో, అవన్నీ మొలకలెత్తాయి. పదిరెట్లు విజృంభించాయి. ఆయన మొదలు పెట్టినవి ఆయనతోటే నశించాయి. కట్నాలు మానిపించే మహానుభావు లెవరన్నా ఉన్నారా?’

‘రామమోహనరాయి, కేశవచంద్రసేను, దయానంద సరస్వతి, రామకృష్ణపరమహంస, వివేకానంద, విద్యాసాగరులు ఇటువంటి మహానుభావులూ, నేడు గాంధీగారూ ఇవి తప్పుతప్పు అని ఖండిస్తూవుండడము, ఒకళ్ళ ఇద్దరో అలా నడుచుకోవడము అంతే. అవన్నీ పుబ్బలోపుట్టి మఖలో మాడడము, చూడండి, మా జమీందారు బాబుగారు నేను బ్రహ్మసమాజకుణ్ణి, నేను విధవా వివాహం చేసుకుంటాను, నేను కట్నాలు పుచ్చుకోను అన్నాడు నిన్నటి వరకూ. ఇవ్వాళ్ళ? ఎదిగిన పిల్లనే అనుకోండి, చేసుకుంటున్నా ఆరువేల రూపాయలు కట్నము ఏమిటి? వెధవ కబురులు ఎన్నైనా చెప్పవచ్చు, చెయ్యడమేది?’

‘ఓరబ్బో! గోడలకు చెవులుంటాయి. గట్టిగా మాట్లాడకు. తద్దినాలు మానేశాడు. ధర్మకార్యాలు తగలెట్టాడు. యజ్ఞోపవీతము తీసేశాడు. కాని అంతే! ఈ పెళ్ళికిచూడు, ఎన్నివేలు ఖర్చవుతాయో! బ్రహ్మసమాజమువాడైతే, వెధవపిల్లని చేసికోవాలి. కట్నము పుచ్చుకోకూడదు. ఒక రోజులో ఏ వెంకటరత్నమునాయుడుగారి యాజమాన్యాన్నో వివాహం చేసుకోవాలి మగవాడైతే! ఏమంటావు?’

అని జమీందారీ ఠాణేదారులిద్దరు మాట్లాడుకొనుచు కూర్చుండినారు విశాఖపట్టణం హుజూరు ఠాణాఆఫీసులో.

జమీందారి ఉద్యోగులందరు పొట్టు పొట్టయిపోవుచున్నారు __ డబ్బు పోగుచేయుటలో, సరంజాములు చేయుటలో, శుభలేఖలు వ్రాయుటలో, అలంకారములు సమకూర్చుటలో, అటువంటి యింక నెన్నియో పనులలో,