పుట:Narayana Rao Novel.djvu/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

నా రా య ణ రా వు

జగన్మోహనుడు అడిగినచోట నడుగకుండ 50 వే లప్పుచేసినాడు. పది గ్రామములలో రెండు గ్రామములు తనఖా పెట్టినాడు. కట్నాలని, నజరానాలని ఇరువది వేల రూపాయలు రైతులనే గానుగాడి ప్రోగుచేసినాడు.

కర్నూలు పోవుటకు ప్రత్యేక ధూమశకటము. చుట్టములు, స్నేహితులు గొప్పకుటుంబములవారే పిలువబడిరి. విదేశీయబ్యాండు తెప్పించినారు. పాట కచ్చేరీలు పనికిరావట. ఒకరోజే వివాహము. విశాఖపట్టణములోను, చెన్నపురిలోను ఉన్న జగన్మోహనరావుగారి స్నేహితులగు యూరేషియను కుటుంబాలవా రాహ్వానింపబడిరి. వారికై పటకుటీరము లేర్పరుపబడెను. ఒక పెద్ద సినిమా హాలులో వారి భోజనములకు, నాట్యమునకు నేర్పాటు చేయబడెను.

శారదయు, నామె తల్లియు వివాహమునకు వచ్చిరి. బళ్ళారిలోనున్న శకుంతలాదేవియు వివాహమునకు విచ్చేసినది.

తోడల్లునకు శుభలేఖవచ్చినను, నారాయణరావునకు గబురే లేదు.

వివాహవిధి నిముషములో జరుగవలెను. అనవసరములగు తంతులన్నియు మాన్పింపబడినవి. సంబంధమునకై దేశదేశములు వెదకిన సుబ్బరామయ్యగారు జగన్మోహనుడు కోరిన షరతులన్నిటికీ ఒప్పుకొనెను.

పెండ్లికూతునకు జగన్మోహనుడన్నియు పాశ్చాత్యాభరణముల నిచ్చెను.

సుబ్బరామయ్యగారు రప్పించిన చెన్నపట్నపు సన్నాయిమేళము విడిది కడ గానము చేయరాదు. కొందరికి బల్లలమీద భోజనములు.

ఊరేగింపు టుత్సవమునకు ముందు ఐరోపీయబ్యాండు (వాయించువారు నల్లవారే). తరువాత పెండ్లికుమారుడు, కొమరితయు గూర్చున్న రెండు గుర్రములబండి, వెనుక బదునైదు గుర్రపుబండ్లు.

పెండ్లికుమారు డప్పుడే ఇంగ్లండునుండి వచ్చిన ఇంగ్లీషు యువకుని దుస్తులు ధరించి టోపీ చేతనుంచుకొని కూర్చుండెను. పెండ్లికుమార్తెకు నింగ్లీషుబాలిక వివాహమునాడు ధరించుదుస్తులు ధరింపించినాడు వరుడు. ఆ దుస్తులు స్నేహితులగు యూరోషియనులు తెప్పించినారు. వారి ఆడవారు వధువు నలంకరించినారు.

ఊరేగింపులో యూరేషియనులు బండికొక స్త్రీయు పురుషుడు చొప్పున పదమూడు బండ్లలో నున్నారు. వెనుక రెండుబండ్లలో పెండ్లికుమారుని చుట్టములు, జమీందారిణి, శారద, శకుంతలాదేవి, శకుంతలాదేవి సంతానము, పెండ్లికుమారుని తల్లివంకవారు తండ్రివంకవారు పదునైదుగురు.

కర్నూలులో నిది బాశ్చాత్య వివాహమాయని ఱిచ్చపడిరి.

జమీందారిణి మేనల్లుని వివాహపు బద్ధతుల నన్నింటిని మెచ్చుకొన్నది.

జగన్మోహనుని తల్లి శివకామసుందరీదేవి జమీందారిణి: ‘అందుకనే మావాడంటే అందరికీ గౌరవం వదినా.’