పుట:Narayana Rao Novel.djvu/265

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
264
నా రా య ణ రా వు


‘అమ్మా! అన్నిటికీ కారణము లేకుండా ఉండదు. కర్మయొక్క విచిత్రము అదే!’

‘కర్మ అనేది విధి (ఫేట్) అనేది కాదుకదా?’

‘కాదమ్మా కాదు! కర్మకూడా ఆత్మతోపాటు అనాదిసిద్ధమైందే; అది మూడు భాగాలుగా విభజించారు. ప్రారబ్ధ, సంచిత, ఆగాములని. ప్రారబ్ధం పాతకర్మలు కారణంగా వచ్చినది. అది ఎవ్వడికీ తప్పదు. మహాత్ములకున్నూ, రామకృష్ణపరమహంసవంటి జీవన్ముక్తులకున్నూ తప్పదు. రామకృష్ణపరమహంసకు కంఠములో వ్రణము వేయడము విన్నావుకదూ?’

‘ఆ విన్నాను.’

‘ఇక సంచితము ప్రస్తుత కర్మ. దీని యొక్క ఫలితము ఇప్పడున్నూ, ముందున్నూ సంభవిస్తూ ఉంటుంది. ఆగామి అనేది ముందువచ్చేది. ఇప్పటి కోర్కెలు, ఇప్పటి భావాలయొక్క ఫలితము. నువ్వు జ్ఞానివై కర్మయోగివైతే ప్రారబ్ధము అనుభవిస్తూ, సంచితము, ఆగామి కర్మలను నశింపుచేసుకుంటే జీవన్ముక్తురాల వౌతావన్నమాట.'

‘ఆ రెంటిని నశింపుచేసుకొనుట ఎల్లాగో? నేను రామకృష్ణపరమహంస సుభాషితాలు, గ్రంథాలు చాలా చదివాను. నాకు స్పష్టంగా తెలియలేదు.’

‘నాకుమాత్రం తెలుస్తుందా చెల్లీ! ప్రాపంచికమైన యీ మిడిమిడి జ్ఞానంతో ఎంత చదివినా మన జ్ఞానం ఊహామాత్రం. అసలు జ్ఞానం కించిత్తియినా సముపార్జించా లంటే మొదట మహాత్ముడొకడు గురువు కావాలి.’

‘గురువు వచ్చిందాకా మనకేమి లాభంలేదన్న మాటేనా?’

‘అలాకాదు. నీకు ఆ తహతహ, ఆ జిజ్ఞాస ఎప్పుడు ఉంటుందో, ఏ సాధువాక్యాలో వినికాని, చదివికాని, కర్మమార్గంలోకాని, యోగమార్గంలోకాని ప్రవేశించాలని వెర్రిపుట్టుతుంది. అప్పుడే నీలో నీవే ఏదో పద్ధతి పెట్టుకొని గురువుకు ఎదురుచూస్తూ ఉంటావు. ఆ యెదురుచూట్టంలో జ్ఞానులన్న వాళ్ళని వెళ్ళి ఆశ్రయిస్తూన్నా ఉంటావు. ఆ యెదురుచూచే గురువు నిన్ను వెదుక్కుంటూనే వస్తాడు.’

‘కళావిషయంలో మీకోసం నేను ఎదురు చూచినట్లు!’

‘నే నెంతవాడిని! పాపిని. ఏ విషయంలోనూ నేనుగురువుగా ఉండలేను.’


౧౬ ( 16 )

జగన్మోహనుని పెండ్లి

కర్నూలు వాస్తవ్యులు రామరాజు సుబ్బరామయ్యగారి కుమార్తెనిచ్చి వివాహము చేయుదుమని జగన్మోహనరావు జమీందారుగారికడకు రాయబారులు వచ్చిరి. సుబ్బరామయ్యగారు లక్షాధికారి. వారి అమ్మాయికి జమీందారీసంబంధం