పుట:Narayana Rao Novel.djvu/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

‘గురువు వెదుక్కుంటూ వస్తాడు’

263

శ్యామసుందరినిగూర్చి లోకముమాత్రము గుసగుసలు సల్పుచునే యున్నది. ‘అనేకమంది విద్యార్థినులున్నారు. కాని యీ విచిత్ర మెచ్చటను జూడలే’దనువారు, ‘ఆ బాలకు బరపురుష వాంఛ యుండకతీర’ దనువారు, నిట్లు పలువిధములుగ చెప్పుకొనుచుందురు. అట్లనుకొనుచున్నారని శ్యామసుందరికిని తెలియును. ఎంతమంది యేవిధమున ననుకొన్న నేమి, తన పవిత్రత తనకున్న జాలునని యామె చిరునవ్వు నవ్వుకొన్నది. దేశమునకై తాను సలుపు సేవ కేమియు నాటంకము రాకూడదని యామె దృఢప్రతిజ్ఞ పూనినది.

అట్టి శ్యామసుందరి నేడు నారాయణరావు పేరుచెప్పిన పుల్కరించి పోవును. అతని గొంతుక వినుచు గంటలకొలది యట్లుండిపోగలదు. అతని మోము చూచుచు పారవశ్యము ననుభవించును. ఆ సమయములో నొరుల కామె యదృశ్య. నారాయణరావుతో బరమేశ్వరుడు వచ్చినప్పుడెల్ల పరమేశ్వరునికి దన చెల్లెళ్ళను, దమ్ముని ఒప్పగించునది. తానును, నారాయణరావును నెమ్మదిగ నామె చదువుకొను గదిలోజేరి, యనేక విషయముల జర్చించుకొనుచుండువారు. ఒక్కొక్కప్పుడు నారాయణరావు పేము సోఫాపై కూర్చుండి యుండ, తానాతని ప్రక్కనే కూర్చుండి మాట్లాడుచుండును. ఆమె నారాయణరావును ముట్టినను అతడు చలింపక, ఆమెకు దనపైనున్న సోదర ప్రేమకు సంతసించుచుండును.

ఒకనాడు నారాయణు డామెను జూచి ‘చెల్లీ, నీ ఆశయాలు, నీ చరిత్ర చిన్నతనాన్నుంచి నాకు చెప్పు’ మని యడిగెను.

‘ఏముంది అన్నా! చిన్నతనం నుంచి గొప్ప సంగీతపాటకురాలిని అవుదామనిన్నీ, గొప్ప కవిత్వం వ్రాయగలదానిని అవుదామనిన్నీ, దేశంకోసం సర్వస్వము ధారపోయాలనిన్నీ కలలుకంటూ ఉండేదాన్ని. మా అమ్మగారు నాన్నగారుకూడ నన్ను ‘స్వప్నబాల’ అంటూ ఉండేవారు.

‘మా నాయనగా రుద్యోగం విషయంలో మారినప్పుడల్లా చిన్నబిడ్డనై ఉన్నప్పుడు దారీ, చెట్లు చేమలు, ఆకాశం అన్నీ నన్ను ఆనందంలో ముంచేస్తుండేవి. నేను ఆటకు బొమ్మలు తెమ్మనిగాని, ఆడుకునేందుకు వెళ్ళాలనిగాని మారాం పెట్టేదాన్ని కాదట. ఇతర పిల్లలతో ఆటకు వెళ్ళేదాన్ని కాదట. అస్తమానము చెట్లు చేమలు చూడడం, గ్రామఫోనులో పాటలు వినడం మహాఇష్టంట. త్యాగరాజు గారి ‘రామాభిరామా’ నన్ను చిన్నతనాన్నుంచి పుల్కరింపచేస్తూండేది అన్నా.’

నారా: చెల్లీ! రామాభిరామా కృతి నాకు వెఱ్ఱే ఎత్తిస్తుంది. అది ఒకటీ, ‘ఆరగింపవా పాలు’ ఒకటి, ‘నను పాలింప నడచివచ్చితివా’ ఒకటి, వీటికి నేను తన్మయత్వంలో మునిగిపోతా చెల్లీ!

‘మనము పూర్వమునుంచిన్నీ అన్నా చెల్లెళ్ళమేమో తెలియదు. ఇన్నాళ్ళనుంచి కలియకుండగా తిరుగుట ఏమో? ఎన్ని సంవత్సరాలు వృథా అయిపోయినాయో?’