పుట:Narayana Rao Novel.djvu/243

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
242
నా రా య ణ రా వు

‘ఆ గుహలన్నీ ఒక తరాన తొలిచినవికావు. అవికొన్ని చైత్యాలక్రింద, కొన్ని విహారాలక్రింద నున్నవి. చైత్యం అంటే గుడివంటి గుహ. విహారము బౌద్ధభిక్షువులుండే గుహ. కొన్ని కొన్ని విహారాలలో వేయిమంది సౌఖ్యముగా కూర్చుండవచ్చును. ప్రతి గుహయందూ బుద్ధదేవుని విగ్రహమున్న గర్భమందిరముంది. అట్టి గుహల్లో చాలావాటిలో గోడలకు లోకప్పుకు, స్తంభాలకు మట్టి మొదలైనవి కలిపిన ముద్దపూసి, దానిపై దివ్యమైన చిత్రలేఖనం చిత్రించినారు. ఆ రంగులు నేడు పూసినట్లుగా ఉన్నవి. బుద్ధజాతకకథ లెన్నియో అందు చిత్రించి ఉన్నాయి. బోధిసత్వుని మూర్తులు, బుద్ధుని మారుడు పరీక్ష చేయుటయున్నూ చిత్రించి ఉన్నవి. ఇవికాక అలంకార చిత్రవిన్యాససంపద ఇంతా అంతా కాదండి. ఏనుగులు, పక్షులు, జింకలు, మనుష్యులు, పళ్లు, కమలములు మొదలగు పూవులు అన్నియు అలంకారవిన్యాసములోనికి తీసికొనివచ్చి ఒక అద్భుత చిత్రప్రపంచం అల్లారండి.

‘అజంతాలో వారంరోజులున్నాము. అక్కడ నుంచి మన్‌మాడు మీదుగా ఎల్లోరా గుహలకు వెళ్ళాము. ఎల్లోరా గుహలలో ముఖ్యమైన పదహారవ గుహను రాష్ట్రకూటులరాజగు మొదటి కృష్ణరాజు దొలిపించినాడు. ఎల్లోరాలో జైనగుహలు, బౌద్ధగుహలు, హిందూగుహలు ఉన్నవి. అన్నింటి కన్న విచిత్రమైనవి హిందూగుహలే.

‘కృష్ణరాజుకు కుష్టురోగము అంకురించినదట. యెట్టి ఘనవైద్యులున్నూ ఆరోగ్యము కుదర్చలేక పోయినారుటండి. ఇంతలో ఒక ముసలిబ్రాహ్మణుడు ఒకరోజున వచ్చి, ‘ప్రభూ ఎల్లోరాగుహలోని శివప్రీతికరమగు నొక చిన్న కందరములో ఒక జల వెలిసింది. అద్దాని సేవించి నీలకంఠుని ప్రార్థించినచో మీకు రోగం నివృత్తి అవుతుందని చెప్పి యెక్కడికో వెళ్ళిపోయాడుటండి.

‘తన రాజధాని మాన్యకేతనం వదలి, రాష్ట్రకూటరాజు తిన్నగా ఎల్లోరావెళ్ళి అచ్చట మకామువేసి, శివుని ప్రార్థిస్తూ ఆ శిలల్లోంచి పుట్టిన నీరు త్రాగాడుటండి. అతనికి కుష్టు సంపూర్ణంగా పోయిందట. అప్పుడు శ్రీ పరమేశ్వర ప్రీతికరంగా కైలాసమే ఆ కొండలో నిర్మించాలని ఆ ప్రభువునకు నిశ్చయం కలిగి శిల్పులలో పేరుపొందిన యొక మహానుభావుణ్ణి రప్పించి, కైలాసంవంటి దేవళం ఈ కొండలో దొలిపించాలి అని అన్నాట్ట. ఆ శిల్పి కైలాసగిరికి ప్రయాణం చేసి, ఒక ఏడాదిలో తిరిగివచ్చి, అనేక శిల్పులను పోగుచేసికొని, ఆ దేవాలయం నిర్మించాట్టండి కొన్ని సంవత్సరాలకి.

‘సుమారు నూరడుగులపైన ఆ కొండప్రక్కగా దొలిచి అందులో గుడి, మండపం, గోపురం, రెండు ధ్వజస్తంభాలు, రెండు ఏనుగులు, యాత్రికుల మందిరాలు, విహారమండపం అన్నీ చేశారు. ఒకేరాయి గుడిఅంతా. సింహాల మీద, ఏనుగులమీద, శరభాలమీద గుడి నిలిచియున్నట్లు చెక్కారు.