పుట:Narayana Rao Novel.djvu/244

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది౧౧ ( 11 )

ఆంధ్రమహారాజ్య చిహ్నములు

నారాయణరావు తన యాత్రలనుగూర్చి చెప్పుచున్నకొలది జమీందారుగారు, సుబ్బారాయుడుగారు మొదలగు చుట్టపక్కములత్యంత సంతోషముతో వినుచుండిరి. ఇంతలో గ్రామస్థులును, నారాయణరావు నెలకొల్పిన గ్రంథాలయ కార్యదర్శియు, నధ్యక్షుడును వచ్చి యందరకు నమస్కృతులిడి కూర్చుండిరి. వారు నారాయణరావును, బరమేశ్వరుని తమ యాత్రలగూర్చి యుపన్యాసముల నిమ్మని కోరుటకు వచ్చిరి. జమీందారుగా రల్లుని తప్పక యొప్పుకొమ్మని చెప్పినారు. నారాయణరావు వల్లెయనెను.

‘ఒకేరాయి, పైనుంచి యింకొకశిల తీసికొనిరాలేదు. ఇది సరిగదా, ఇక ఆ శిల్పంయొక్క అందం ఇంతని వర్ణించడానికి వీలు లేదండి.’

అక్కడకు వచ్చినవారిలో నొకరు ‘ఎంత కష్టం అండి చెక్కడం, ఆ రాతిలోనే అంతా. ఒకేరాయి లోపలా పైనాకూడా చెక్కాలంటే ఎంత కష్టం, మా గొప్ప శిల్పం అండీ’ యనినాడు.

‘గుహలన్నీ ముప్పై ఉంటాయి. ముందు బౌద్ధగుహలు, తర్వాత హిందూ గుహలు, తర్వాత జైనగుహలు బయలుదేరాయి. హిందూగుహలలో దశావతారం అన్న గుహలో చాలా గొప్పశిల్పం ఉందండి!’

ఆ సాయంకాలం సభలో పరమేశ్వరుడు మాట్లాడినాడు. నారాయణరావు కంఠముకన్న బరమేశ్వరుని కంఠము ఉపన్యాసము లిచ్చుటలో నెక్కువ గంభీరత దాల్చును. అతడు వేలకొలది జనమును దన వాగ్ధారలో ముంచియెత్తుకొనిపోగలడు. నారాయణరావు గొంతుక యుపన్యాసములో మధురముగా నుండును. ధారాశుద్ధిగలది. ప్రతివిషయమునుగూర్చి లెక్కలు మున్నగు వివరములు చెప్పుచు శ్రోతల హృదయము చూరగొనును.

బరమేశ్వరుడు లేచి ‘మానవుని హృదయం విశాలం అవ్వాలంటే దేశాలు తిరగడం ఒకమార్గం. ప్రతి విద్యార్థినీ, ప్రతి రైతు కుఱ్ఱవాణ్ణి చివరకు ఆంధ్రదేశమైనా పూర్తిగా తిరిగిరమ్మనాలి. ఆంధ్రదేశంమాత్రం తక్కువ ఉందా! ఋషికుల్యానదికడనుండి కంచివరకు, సముద్రం ఇటు, అటు ముచికుంద నది, భీమనది మొదలైనవి ఎల్లలు. మనదేశం ఏలినవాళ్ళు ఆంధ్రులు. మొదట మనకు చరిత్రలో తెలిసివున్నంతమట్టుకు ఆంధ్రులు ఆఖరి కాణ్వాయణచక్రవర్తిని చంపి, తాము చక్రవర్తులై రాజ్యం చేశారు ఆరువందల సంవత్సరాలు. తర్వాత ఇక్ష్వాకులు, సాలంకాయనులు బృహత్పాలాయనులు, పల్లవులు రాజ్యం చేశారు. విజయవాడలో, వేంగిలో, కాంచిలోను. తర్వాత గాంగులు, చాళుక్యులు,