పుట:Narayana Rao Novel.djvu/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశయాత్రా విశేషములు

241

రెండుండేవిట. ఒకటి ఒక ఇంజనీయరు విప్పి మళ్ళాకట్టినాడట. అందువల్ల కదలుట మానినది. రెండవది పైకెక్కి ఇటు నటు కదల్చినచో కదలిపోవును. నీరు గిన్నె నిండుగా పోసి మినారట్ కదిల్చినచో నీరొలికిపోవును.

‘అహమ్మదాబాదు నుండి కథియవారు వెళ్ళి శ్రీ గాంధీమహాత్ముని జన్మస్థానమగు పోర్‌బందరుపురము, శ్రీ గాంధిమహాత్ముడు పుట్టిన గృహమును గనుగొని యానందపూర్ణుల మయ్యాము. అక్కడ నుంచి ద్వారక వెళ్ళాము. ద్వారక నుండి తిరిగి అహమ్మదాబాదువచ్చి, అచ్చటనుండి ఆబూపర్వతం వెళ్ళాము.

‘ఆబూస్టేషను నుండి ఆబూపర్వతానికి మోటారుబస్సున్నది. మోటారు మీద నాలుగు వేల అడుగుల ఎత్తున్న ఆబూపట్టణానికి వెళ్ళాము. అచ్చటినుంచి తిన్నగా దిలావర జైనదేవాలయములు చూశాము. అహో! ఏమి యాదేవాలయ శిల్ప సౌభాగ్యము! ఎంత చూచినను తనివితీరదండి. అంతా పాలరాయి చెక్కడమే. ఆప్రదేశం అంతా రూపాయలుపరచి జైన భక్తుడు కొన్నాట్ట. ఎన్ని కోట్లు ఖర్చు చేయించి ఆ గుడి కట్టించాడో!

‘దిలావరాన్నుంచి అచలేశ్వరం వెళ్ళి అచ్చట పూజారి బ్రాహ్మణుని యింటిలో మకాంచేసి, రొట్టెలు, పాలు ఫలహారంచేసి పడుకున్నాం. మరునాడు ప్రొద్దున్నే దత్తాత్రేయశిఖరానికి వెళ్ళాము. అయిదువేల అడుగుల ఎత్తు ఆ శిఖరం. పైన ఒక పెద్దరాయి, ఆ రాతి పైన ఒక గుడి ఉంది.

‘ఆబూపట్టణం నుంచి చిత్తూరు వెళ్ళాం. చిత్తూరు మార్వార్ మహారాణాలు సంగరాణా, భీమసింగు, లక్ష్మణసింగు, హమీరు మొదలగువారు మహాప్రతాపవంతులు పరిపాలించిన ఆ మహాపట్టణము చూచినప్పుడు కన్నుల నీరు తిరిగినది. అక్కడనుంచి తిన్నగా బరోడా వచ్చాము. బరోడాలో ఆగి, గైక్వారుగారి భవనములు, తోటలు మొదలగునవి యన్నియు జూచి సూరతు వచ్చి యచ్చటనుండి బార్డోలీ వెళ్ళాము. బార్డోలీ ప్రజల వీరత్వమంతయు మొదటి నుండి వినియున్నందున, ఆ దేశం చూసి, ఆ ఊళ్ళో నాయకులను కలసుకొని, అచ్చట ఒక రోజాగి, తిన్నగా బయలుదేరి జాల్‌గాను వచ్చి చేరాము.

‘జాల్‌గాను దగ్గర బొంబాయినుండి ఢిల్లీకి బోవు జి. ఐ. పి. రైలు ముఖ్య మార్గమున్నది. జాల్‌గాన్ నుండి మోటారు చేసికొని తిన్నగా అజంతాకు పోయాము.

‘అజంతా చూచి మా పరమేశ్వరుడు మూర్ఛపోయాడు. ఆతని ఆనందానికి మేరలేకపోయింది. చిత్రకారుల కది కాశీపట్టణం. ఇప్పటికి రెండువేల సంవత్సరాలకు పూర్వంనుంచి పధ్నాలుగువందల సంవత్సరాల క్రితంవరకూ ఆరువందల సంవత్సరాలు వృద్ధిపొందింది.

‘భోగిరానది సాత్పురా కొండలలో పుట్టి ఆ కొండలను రెండుమూడు మైళ్ళు తొలుచుచు ప్రవహించింది. ఆ లోయలో ఒక్క అరచందాకృతిని ఉన్న వంకరలో యిరువది యెనిమిది గుహలు తొలిచినారు.