పుట:Narayana Rao Novel.djvu/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

నా రా య ణ రా వు

కుమార్తెకు, తల్లి సూర్యకాంతముచే పసుపు, కుంకుమ, చీర, రవికయు నిప్పించెను. హారతి నిచ్చిరి. బ్రాహ్మణ సమారాధన జరిగినది. సంభావన లిచ్చిరి. వచ్చిన చుట్టము లందరకు గంగచెంబు లీయబడినవి. జానకమ్మగారి యక్క గారును బ్రతికియున్నంతవరకు సరిపోయినంత గంగ పట్టుకొని వచ్చినాడు కుమారుడని సంతసించినది.

భోజనములైన వెనుక సుబ్బారాయుడుగారి రెండవ భవనమగు మేడలో జమీందారుగారు, శ్రీరామమూర్తిగారు, సుబ్బారాయుడుగారు, నారాయణరావు, నతని స్నేహితులు, తదితరులు నింకను బెద్దలు తాంబూలము వేసికొనుచు కూర్చుండినారు. ఆలమును, రాజారావును, జమీందారుగారు తన యల్లుని యాత్ర విషయమై అడిగినారు. కాశీ సంతర్పణకై బెజవాడనుండి వచ్చునపుడు పరమేశ్వరుడు తన భార్యను కొత్తపేట తీసికొనివచ్చినాడు. అతడును విశాఖపట్టణములో కాశీసంతర్పణమును సంకల్పించినాడు.

విశాఖపట్టణమునుండి ఆహూతులై పరమేశ్వరుని తలిదండ్రులును, అతని అనుజులు, చిన్న చెల్లెండ్రు వచ్చినారు. రాజారావు తలిదండ్రులు, భార్య సూరమ్మయు, బిడ్డలును వచ్చిరి.

ఢిల్లీ ఫతేపూరు సిక్రీ, ఆగ్రా మున్నగు ప్రదేశములందలి వింతలు చెప్పి, దయాలుబాగు చరిత్రయంతయు జెప్పి యచ్చట నుండి జబ్బలుపురమునకు బోయినారమని నారాయణరావు చెప్పనారంభించెను.

‘జబ్బలపురము దగ్గరనుండి నర్మదానదిలోయ చూద్దామని వెళ్ళాము. ఆ పాలరాతి కొండల్ని తొలిచి ఆ నది ప్రవహించే సొంపు, మన గోదావరి పాపికొండల్ని దొలిచి ప్రవహించు ప్రదేశముయొక్క అందముతో సరిపోతూ ఉన్నదండి. ఆ గుబుర్లు, అడవులు, కొండలు, జలప్రవాహము, నీలాకాశం మమ్మల్ని సమ్మోహింపచేశాయి.

‘అక్కణ్ణుంచి భోపాలు వెళ్ళాము, భోపాలు తర్వాత స్టేషను భిల్సా. అక్కడ సాంచిస్థూపము హిందూదేశములో అందమైన స్థూపాలలో ఒకటి, ఆ స్థూపము చుట్టూవున్న మహాద్వారములందున్న విచిత్ర శిల్పసంపద ఇంకో చోట లేదండి. ఆ మహాద్వారాల్లో ఒకటి ఆంధ్రచక్రవర్తుల ఆస్థానపు శిల్పిధాన్యకటకమునుండి వెళ్ళి, నిర్మించి, చెక్కివచ్చెనట.

‘సాంచీనుంచి ఉజ్జయిని వెళ్ళాము. శ్రీ కాళిదాసాది మహాకవుల పొగడ్తలనందిన ఉజ్జయిని అద్భుతం అయిందండి. దశకుమారుల చరిత్రము, వాసవదత్త, మేఘసందేశము, కథాసరిత్సాగరము వర్ణించిన మహాకాళేశ్వరుని గుడి, మొదలయిన వన్నియు జూచి యచ్చటనుండి అహమ్మదాబాదు వెళ్లాము. శ్రీ గాంధీమహాత్ముని సబర్మతీ ఆశ్రమము చూచాము. శ్రీ మహాత్ములవారిని దర్శనము చేసుకున్నాము. ఎక్కి కదిలిస్తే కదిలే మినారెట్ చూసినామండి. అట్లాంటివి