పుట:Narayana Rao Novel.djvu/240

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
239
దేశయాత్రా విశేషములు

‘రాలేదండి. ఈ ఊరు వచ్చినట్లే మాకు తెలియదండీ.’

‘ప్రొద్దున మెయిలులోవచ్చి యిక్కడ గంగపూజ చేసికొని, బావమరిది యింటిలో భోజనములుచేసి స్నేహితులతో గొత్తపేట వెళ్ళినాడట.’

‘మనయింటికి ఎందుకు రాలేదో?’

‘ఎందుకు రాలేదని అనుకునేది? అతని యిష్టం.’

‘మూడు నెలలైనది. ఇల్లు వదలి, ఇచటికి వచ్చికూడా మనయింటికి ఒకసారైనా రాకపోవడం ఆశ్చర్యమే! ఎప్పుడూ అలా సంచరించేవాడు కాదే!’ అని సుందరవర్థనమ్మగా రనినది.

ఒక వేళ కొత్తచేత సిగ్గుపడినాడేమో? అల్లుడు రాకుండుట కేదియో కారణముండియుండునని యనుకొనవలె. ఏమి కారణమైయుండును? తన భార్యకు అల్లుడన్న బొత్తుగ నిష్టములేదన్న సంగతి గ్రహించినాడు. అనేక పర్యాయము లామె కల్లునిగుణగణములు వర్ణించినాడు. అతనిని గౌరవించనిచో దనను గౌరవించనట్లే యని నొక్కి చెప్పినాడు. ఆమెమాత్రము ప్రసక్తి వచ్చినప్పుడెల్ల నల్లునియందు నిరసనము చూపుచునే యున్నది. ఉదారహృదయుడైన యల్లుడు ఇట్టి క్షుద్రభావములకు జోటిచ్చువాడు కాడు. భార్యగాని, యితరులుగాని అల్లుడు తన యింటికి వచ్చుటకు సిగ్గుపడునంతటి యగౌరవము సలిపియున్నచో నట్టివారికిని దనకు నా నిముషముతోసరి, యని యనుకొని భార్యను జూచి, ‘అతని మనస్సు పరమోత్కృష్టమైనది. అతడు చిన్నచిన్న దానికి మనస్సు కష్టపెట్టుకోడు. ఇంతవరకు ఈ ఊరు వచ్చినప్పుడు మన యింటికి రాకుండా ఉండలేదు. నువ్వెప్పుడైనా అతనికి మనస్సు నొచ్చు కార్యము లేమియు జేయలేదుకదా?’ అనెను జమీందారు.

‘అబ్బే, లేదండి.’

‘అతని హృదయం మనవాళ్ళలో ఎవరివల్లనైన కష్టపడినదంటే వారు నాకు కానివారు. ఈ జన్మలో వాళ్ళకూ నాకూ ఏ సంబంధమూ ఉండదు.’

‘అంత విచిత్రంగా మాట్లాడతారేమిటి? అతన్ని అగౌరవపరచేవాళ్ళెవరండీ?’ వరదకామేశ్వరీదేవి లోన కంపించినది. తానేమియు పొరపాటున యల్లుని బాధించలేదుగదా?

కాశీసంతర్పణకు జమీందారుగారు భార్యను, సోదరిని, గుమారుని, శారదను వెంటదీసుకొని కొత్తపేట వెళ్ళినారు.

ఎప్పుడు రాని వియ్యపురాలు వచ్చినదని కామేశ్వరీదేవి యడుగులకు మడుగులొత్తించిరి వియ్యాలవారు. శారదా నారాయణరావులు బీటలపై కూర్చుండవలసి వచ్చినది. దంపతు లిరువురు గంగాపూజ సలిపినారు, పీటల మీద కూర్చున్న బావగారికి కేశవచంద్రుడు ఖద్దరువస్త్రముల నిచ్చినాడు.