పుట:Narayana Rao Novel.djvu/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొ త్త పే ట

23

జమీం: నీ యీడున షేక్సుపియరు పేరే తెలియదమ్మా మాకు. నీకు మంచి గురువు గారు దొరికింది. నాదగ్గర ‘ఆర్డెను ఎడిష’ నుంది. అది వెరిటీ కన్న చాలా మంచిది.

తండ్రి కొమార్తెల కిరువురకు సంభాషణ ఇంగ్లీషులోనే జరిగినది. తండ్రి శారద వైపు చిరునవ్వుతో చూచి ఇంగ్లీషులో నిట్లు పలికెను.

‘శారదా! జగన్మోహనరావు సంగతి నీకు చాలా వివరించి చెప్పాను. నీకు సర్వవిధములా తగిన వరుణ్ణి ఈ రోజున రప్పిస్తున్నాను. చదువులో మొదటివారిలో మొదటివాడు. రూపసంపదే కాదు, మంచి బలమైనవాడూ, అందమైనవాడూ. ధనంలో మనకెంత ఆస్తి ఉన్నదో అతనికి అందులో సగం ఉన్నది. అతను ఎఫ్. ఎల్. పరీక్షకు వెళ్లినాడు. మొదటివాడుగా నెగ్గుతాడు. పరీక్షలోను, ఆటలలోను నెగ్గిన మెడల్సు కప్పులు కాకివారి షాపంతషాపు పెట్టించవచ్చు నన్నారు.’

శారద సిగ్గుపడి చిగునగవుతో మాట్లాడక తలత్రిప్పి యూరకున్నది.

వర్ధనమ్మ గారు తమ్మునితో ‘నీతో చెప్పుటకు సిగ్గుపడుతుందేమోనోయీ’ అని యన్నది.

‘వారంతా సాయంత్రమునకు అమ్మాయిని చూడడానికి వస్తారు’ అని జమీందారు గారు స్నానమునకు లేచినారు.


౬ ( 6 )

కొత్తపేట


సుబ్బారాయుడు గారు మంచి సరసుడు, మాటకారి. తేనేలూరు నట్లేవ్యవహారమునైనను, తేట తెల్లముగ వివరింపగలరు. వ్యవహారదక్షులైన సుప్రసిద్ధ న్యాయవాదులే యాయన మాటలు చెవులార వినుచుందురు. అప్పులిచ్చు షాహుకార్ల కందఱకు తప్పనివగు ధనసంబంధ వ్యాజ్యములలోదప్ప నితరముల యెడ నాయనకు సంపర్కమేదియు లేకపోయినను, చక్కని బుద్ధిసూక్ష్మత, పరిశీలనాదక్షత కలవాడగుటచే నేసంబంధమైనను, న్యాయసూత్రాలపట్ల విచిత్రాలోచన చేయగలడు. సలహా చెప్పగలడు. చదువుకొని పట్టాను బొందినచో భాష్యం అయ్యంగారు కాదగిన తెలివి యాయనకు గలదు. హిందూ న్యాయశాస్త్రములో నిదివరకు లేని కొన్ని సూక్మముల వివరించి యాయన యొసంగిన సలహాలవలన, ఒక దత్తతాభియోగము నెగ్గినదనియు, నా వ్యవహారపు దీర్పే దత్తతాన్యాయమును చాలావరకు మార్చినదనియు కోనసీమలోని పండిత పామరు లందరికిని దెలియును.

పచ్చని దబ్బపండుచాయ మానిసి, పొడగరి. ఆజానుబాహుడు. తెల్లగా నచ్చటచ్చట నెరసినతల, గడ్డము, మీసము లాయనకు వింతశోభ నిచ్చును. పొలముదిమ్మవంటి వక్షముతో, వట్రువలు తిరిగి కండలూరిన బాహుసంపదతో,