పుట:Narayana Rao Novel.djvu/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
22
నా రా య ణ రా వు


వర్ధనమ్మ: పల్లెటూళ్ళలో మెరపకాయ కాల్చుకొని తింటూ డబ్బు నిల్వవేసుకొన్న కోమట్లలాంటి మనవాళ్ళు కొందరున్నారు. అలాంటి వాళ్ళు కాదుకదా?

వరదకామే: బాగా అన్నారు వదినా!

జమీం: మనకన్నా మర్యాదకలవాళ్ళు. జమీందారులకు బుద్ధులు నేర్పగల పరువు ప్రతిష్టలు కలవాళ్ళు.

వర్ధనమ్మ: పెళ్ళికొడుకు ఎల్లాఉంటాడు?

వరద కామే: ముంజేతి కంకణానికి అద్దమెందుకు వదినా! పెళ్ళివారు వస్తున్నారుగా! పల్లెటూరి ఆంబోతు కేమీ తీసిపోడు లెండి.

వర్ధనమ్మ: ఆ! మరచిపోయాను, పెళ్ళికొడుకు ఏం చదివాడు?

జమీం: పెళ్ళికొడుకుది నవమన్మధాకారం. వంట్లో రక్తము లేక పాలిపోయి, అదో మంచి మేలిమిబంగారు రంగని చెప్పుకుంటూ నాల్గడుగులు నడవలేని మన జమీందారి దద్దమ్మ కాడు. అందానికి అర్జునుడు, బలానికి భీముడూ. ఈ సంబంధము కుదిరితే మన శారద ఆదృష్టవంతురాలు.

వరద: కాకిముక్కుకు దొండపండు. ఇంతకూ మీకు మా వాడు నచ్చ లేదు. వాడి కేమి లోటో, ఎందుకు నచ్చ లేదో నాతో చెప్పారు కాదు. ఖర్చు కొంచెము ఎక్కువ చేస్తే దుర్వ్యయమ౦టారు. ఓర్వలేనివాళ్ళు కల్పించినవన్నీ నమ్ముతారు. శారద కూడా ఎదుగుతూంది. దాని అభిప్రాయముకూడా అడగడం మంచిది. మీరు నవ నాగరికులు గాదూ! వీరేశలింగంపంతులుగారితో స్నేహము చేసిన వాళ్ళేగా! ఆడపిల్లకు ఏసంబంధం యిష్టమో అది చేయడమే మంచిది కాదూ?

వర్ధ: ఆ! మరదలు గారు స్వయంవరాలు చేయించమంటారు. శారదను పిలిపించండి.

ఇంతలో మెరపుతీగవలె శారద యచ్చటికి వచ్చినది. తండ్రి గారు చేతులు చాచుటతోడనే యా బాలిక పూలబంతివలె ఆయన కౌగిలింతలోనికి వచ్చి వ్రాలెను. కుమార్తెశిరము మూర్కొని తనప్రక్క సోఫాపై కూర్చుండబెట్టుకొని, జమీ౦దారు గారు ‘శారదా, ఎక్కడికి వెళ్ళినావమ్మా’ యని ప్రశ్నించిరి.

శా: తోటలో పువ్వులు కోసుకుందామనీ, నీళ్ళు సరీగ్గా తోడాడో లేదో చూద్దామనీ వెళ్ళాను. నాకోసం మీరు చెన్నపట్నం వ్రాసినపుస్తకం వచ్చిందండి బాబయ్యగారూ. నిన్ననే షేక్స్పియరు మొదలు పెట్టింది మా దొరసానమ్మ గారు. ‘వెనీసు వర్తకుడు’ అనే నాటకం. మనం తెప్పించుకున్న పుస్తకంలో నాటకాలన్నీ ఉన్నాయి. బొమ్మలు కూడా చాలాబాగా ఉన్నాయండి. కాని ‘వెరిటీ ఎడిషన్’ కావాలట. అది తెప్పించి పెట్టరూ బాబయ్యగారూ?