Jump to content

పుట:Narayana Rao Novel.djvu/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

నా రా య ణ రా వు

కోలనై, బింక మొలుకు మోముతో, విశాలమై లోతైన కాటుక కన్నులతో, విరివియై విశాలమైన ఫాలముతో, తెల్లని యజ్ఞోపవీతముతో నాయన ద్రోణుని దలపించుచుండును.

సుబ్బారాయుడు గారి కెన్ని కథలు వచ్చునో లెక్క లేదు. ఆయన చెప్పు కథలు పెద్దలుగూడ తనివోవ వినుచుందురు. కొంచె మెచ్చుతగ్గుగా ననేక భాషలలోని గ్రంథములన్నియు నాయన పఠించినారు. కథలు సందర్భానుసారముగా నాయన కల్పించవలసి వచ్చిన కల్పించును. ఒక సారి కల్పించిన కథను మరల నెప్పటికిని మఱచిపోడు.

ఆ నాటి సాయంత్ర మేడుగంటలకు, దన నాల్గవ కొమరిత ఊకొట్టు చుండగా కాశీమజిలీలలోని అదృష్ట దీపుని కథ యాయన చెప్పుచుండెను. పెద్దకొమరుడు, నాతని సంతానమగు నిద్దఱు కొమాళ్ళును కొమార్తెయు, సుబ్బారాయుడు గారి భార్య జానకమ్మ గారు, కొందరు రైతులు, ఇరుగు పొరుగు బ్రాహ్మణులు, చుట్టములు, కాళ్లు పట్టుచున్న మంగలి, విసనకఱ్ఱ వీచుచున్న చాకలి యా కథ వినుచుండిరి. ఇంతలో గొన్ని బండ్లు వారి యింటిముం దాగిన చప్పుడైనది.

నారాయణరావు లోనికి వచ్చినాడు. ‘అన్నయ్య వచ్చాడు. అమ్మా! చిన్నన్నయ్యేవ్!’ అంటూ సూర్యకాంతం లేచి పరుగున అన్న గారిదగ్గరకు జేరినది. నారాయణరా వామెను సునాయాసముగ బైకెత్తి తనహృదయమున నదిమికొని ముద్దిడి క్రిందికి దింపినాడు. ‘చిన్న నాన్న గారు! తిన్న నాన్న గాలు! తిన్న నాన్న గాలు!’ అనుచు నారాయణరా వన్న కుమార్తెయు, నిరువురు కొమరులును, లేగదూడలవలె పినతండ్రికడకు పరుగు వారిరి. ముగ్గురి నొక సారిగా నెత్తి వేసికొని యొకరిని భుజముమీద, నిరువురిని జేతులలో నిముడించుకొని, చెల్లెలు తన్ను చేయి చుట్టి నడువ, ముందరి మండువాలోకి బోయినాడు. బండి వాడును, చాకలి, మంగళ్లు, సామానంతయు లోనికి జేర వేసిరి. నారాయణ రా వందులో నొక పెద్ద పెట్టె పై మండువాలో దింపించి, తాళము తీసి, యందులో నుండి బొమ్మ సామానులు, జపాను మర పనులు, చిత్రవిచిత్రములైనవి పుదుచ్చేరీపనులు, విక్టోరియా చిత్రవస్తుశాలలో కొన్న రాగి, వెండి, దంతపు, గంధపు శిల్పపుంబనులు, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్టణపు టద్దకపుదెరలు, ఖద్దరు, పట్టు, నూలు చొక్కాలు, పరికిణీలు, పొందూరు చీరలు, పయ్యద కండువాలు తీసి తన చుట్టు మూగిన తల్లికి, వదిన గారికి, పిల్లలకు, అన్న గారికి, పెదతల్లికి జూపించినాడు.

‘నా గుల్లంబండి బాగా వెలుతోంది’ అన్నాడు అన్న గారి చిన్న పిల్లవాడు.

‘చిన్నాన్న గారూ! నా మోటారు బాగా లేదుటండీ, తమ్ముడు బండి కంటే!’ యని పెద్దవాడు.