పుట:Narayana Rao Novel.djvu/233

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
232
నా రా య ణ రా వు

పురుషోత్తముని అవతారాలు. నిజమైన లయం వచ్చినప్పుడు ప్రకృతి పురుషునిలో లయమై పురుషుడు పురుషోత్తమునిలో లయం అవుతాడు అని చెప్పాడు.

‘ఒరే నారాయుడూ! మనం భగవద్గీత ఇంకా విపులంగా చదవాలిరా మరి.’

ఆగ్రా వచ్చారు ఇరువురు యాత్రికులునూ. ప్రియవధూమణిపై ప్రణయము మూర్తించినట్టి, ప్రణయినీవిరహము ముద్దకట్టినట్టి, కన్నీటిబిందువులు ఘనీభవించినయట్టి, నిర్మల హృదయము నీడై ప్రతిఫలించినయట్టి తాజమహలు ప్రథమదర్శనము వెన్నెలలో నొనరించెదముగాక యని యమునాతీరమున కారాత్రి వెడలినారు.

ప్రపంచమున మానవుడు సృజించిన సప్తాద్భుతములలో నిది యొకటియట. సమస్తరేఖలు, వంపులు, ఎత్తులు, సమాలంకారములు, సంపూర్ణస్వరూపము ఒక్క శ్రుతిలో మేళవించిన మహారాగమువలె తాజమహలు కాళిందితీరమున సౌందర్యము మొలకెత్తినది.

ఉదయారుణరాగము తాజమహలుశిఖరములపై ప్రసరించినప్పుడు చూచినారు. మధ్యాహ్న నిశ్చలతలో గమనించినారు. నక్షత్రకాంతిలో బరికించినారు. చూచినకొలది నొక వింతయానందము, తీరనితృష్ణ వారికి నుద్భవించినది.

నాల్గవనాటి రాత్రి స్నేహితులిరువురు బయలుదేరినారు. పరమేశ్వరుడు తాజమహలును పదునేను చిత్రములుగా చిత్రించినాడు. ఆరాత్రి నారాయణరావు తాజమహలు గీతము పాడుటకు సంకల్పించుకొనెను. పరమేశ్వరుడు తల నాకసముదెస కెత్తి నక్షత్రముల గమనింపుచు గూడ బోయెను. ఇరువురు యమునాతీరమునకు బోయినారు.

నారాయణరావు ఫిడేలు మేళవించి కమాను తీగలపై నానించి కదిపినాడు.

ససారీ

యమునా కల్యాణి, కల్యాణిరాగము, యమునారాగము, కల్యాణి పరమాత్ముని శక్తి: శిల్పశక్తీ ప్రత్యక్షము. యమునాఝరీవేగము ప్రేమప్రవాహము. రెండింటికిని సంయోగము. అదియే యమునాకల్యాణి. నారాయణరావు యమునా కల్యాణి రాగ మాలపించి, రూపకతాళమున తానము ప్రారంభించినాడు.

క్షీరశిల కరిగిపోయినది. యమునానది ప్రవహించుట మానినది. తాజమహలు మాయమై యచ్చట షహజహాను, ముంతాజరాణి పద్మాసనాసీనులై తోచినారు. అంతయు మధురమైనది. పరమేశ్వరు డా యానందములో లీలా నంతస్వరమై యాడుకొన్నాడు .......

దయాలుబాగు సత్సంగులకు మక్కా. ఇచ్చట వారి సద్గురుమహారాజు నివసించుచుందురు. ఇప్పటివా రైదవగురువుగారు, సాయెబ్జీ మహారాజావారు.