పుట:Narayana Rao Novel.djvu/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బృందావనము

231

వివ్వచ్చునకు బోధించి, లోకానికి యుగయుగాలకు సందేశమిచ్చినాడుగదా. ఈ మహాభావము నిలువెల్ల దివ్యామృతముచే నింపుటలేదా? ఆపుకోలేని మధురావేశము పవిత్రాంబువులై నయనాంచల బిందుధారలై జన్మము పూతమొనర్చుచున్నది.

‘ఒరే పరమేశ్వరం! సాంఖ్యవిచారం ఉత్కృష్ఠమైనదే! కాని సాంఖ్యము ఏమి చెప్పింది? ప్రతియాత్మయు పురుషుడు, అతడే సాక్షీభూతమగు పరమాత్మ, వ్యక్తిలోని మనస్సు, అహంకారము, బుద్ధి, ఇంద్రియములు అన్నియు ప్రకృతి. తెలియని వ్యక్తికి సాక్షిభూతుడగు పురుషుడు మరుగుపడి ప్రకృతిచేత గప్పబడి తనబిడ్డలు, తనయిల్లు వాకిలి అని మోసపోయి, గిట్టుతూ పుట్టుతూ ఉండును. కాని జ్ఞానము చేతనూ, యోగము చేతనూ నువ్వు నిన్ను తెలిసికొంటే అప్పుడు పురుషునికినీ ప్రకృతికినీ సమ్యక్‌స్థితి కలిగి అంటే నిశ్చల సమాధి కలిగి జన్మరాహిత్యము సంభవిస్తుంది. సాక్షీభూతుడగు పురుషుడు ఏమిన్నీ మార్పులు చెందడు. ప్రకృతియే మార్పులు చెందుతూ ఉంటుంది. పురుషుడు కుంటిమగనివంటివాడు. ప్రకృతి గుడ్డిభార్య. ప్రకృతికి పురుషుడు దారిచూపిస్తూఉంటే ప్రకృతి పురుషుని మోస్తూ ఉంటుంది.’

‘ఈ సాంఖ్యధర్మంలో ఉండే లోటేమిటి? శ్రీకృష్ణు డెల్లా ఆ లోటు తీర్చాడు?’

‘కపిలమహర్షి యింతవరకును బోధించి, ఆ బోధ సంపూర్ణము చేయలేదు. కాని ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క పురుషుడుగదా. అంటే విశ్వంలో కోటానుకోట్లు పురుషులు వివిధ వ్యక్తిత్వాలతో ఉంటే ఈ పురుషుల శక్తి యేమిటి? ఆద్యంతరహితులై సర్వ బ్రహ్మాండ స్వరూపులే అయితే, వీళ్ళందరినీ నడిపే నాయకుడొకడుండాలి. వీళ్ళందరినీ సృష్టించిన వాడొకడుండాలికదా! అల్లాకాకపోతే ఇన్నికోట్ల ఆత్మలు ఇన్ని బ్రహ్మాండాలు అవుతారా? కాబట్టి శ్రీకృష్ణుడు ఉపనిషత్తులకు పొయ్యాడు. ఉపనిషత్తులు ఏమన్నాయి? ఆద్యంత రహితమై అనిర్వచనీయమైన బ్రహ్మమున్నది. ఆ బ్రహ్మముస్థితి ఎంతటి జ్ఞాన వంతులున్నూ ఊహించలేరు. ఆ బ్రహ్మపదార్థములోనుంచి మూల ప్రకృతి జన్మించింది. ఆ మూల ప్రకృతివలన ఈ సృష్టంతా ఉద్భవిల్లింది. సృష్టిలోని ప్రతి వ్యక్తియు, ప్రతి ప్రాణిన్నీ బ్రహ్మమే. నక్షత్రాలు, ఆకాశం, భూమి, పురుషులు, స్త్రీలు, కుక్కలు, గుఱ్ఱాలు అన్నీ అన్ని ప్రకృతి ఉండడంవల్ల ఈ సృష్టిలో వ్యక్తిత్వం. అది రహితం చేసుకుంటే బ్రహ్మలో లయం.

‘శ్రీకృష్ణపరమాత్మ ఏమన్నాడు? అన్నీ ఒకటే చెపుతున్నాయి. కానీ సంపూర్ణంగా ఏదీ వ్యక్తీకరించడం లేదు. సృష్టికలిగిన కారణం నీకువలదు. అది చిదానందము. కాని సృష్టిఉంది. సృష్టిలో పురుషుడు ప్రకృతి సాంఖ్యలో చెప్పినట్లే. కాని ఈ పురుషుడు, ఈ ప్రకృతిన్నీ ఒక్క పురుషోత్తముని స్వరూపాలే. అన్నీ ఒకటే. సాక్షీభూతుడగు పురుషుడు, ప్రకృతిస్వరూపం. అన్నీ