పుట:Narayana Rao Novel.djvu/202

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
201
పు న స్సం ధా న ము

నారా: అవును. కాని మన సంప్రదాయం వేరు, వాళ్ళ సంప్రదాయం వేరు. అంతే! తక్కిన ‘ఫక్కీ’ అంతటా ఒకటే. లోపల భావాలు వేరన్నమాట.

పర: వాళ్ల ఆశయం ప్రాపంచికం, మన ఆశయం ఆధ్యాత్మికం అంతే తేడా.

లక్ష్మీ: మన వీథినాటకాలు వాళ్ళకున్నాయా?

నారా: ‘ఓపెరా’ లేదు బావా? అది మన వీధినాటకానికి ఒక మోస్తరుగా సరిపోతుంది. ఆ ఓపెరా, సాధారణనాటకం రెండూ కలిపితే మన వీథినాటకం అవుతుంది.

లక్ష్మీ: కాని ఎల్లా భరించగలవురా ఆతందానతాన ధిమికిట ధిమికిట! రాజుభార్య కూడా గంతులు వెయ్యడమే, సంభాషణా మాట్లాడడం ఉండదు. అందరూ కలిసి గంతులూ! ‘నువ్వు ఎవడవురా? నువ్వు యెవడవురా?’ అని పల్లవిని పట్టుకొని ‘నువ్వూ! యెవడవురా?’ అని తణికితతోం అని యిటు గంతు, అటు గంతులో కథానాయికయైన చంద్రమతి తన్మయం అయిపోవడం. ఏమిటిది? నాకంతా ప్రహసనంలో ఉంటుంది. అదీకాకుండా ఒక్కొక్కప్పుడు ఈ పాత్రధారులు ఏ రాజువేషమో వేసికొని ‘రాజు వచ్చే సభకూ పురప్రముఖులందరూ కొలువ’ అని అంటూ వస్తారు. అదేమి అభినయమోయి వెఱ్ఱికాయా?

నారా: బావా! నువ్వు చెప్పిన దోషాలు దోషాలు కావోయి; అసలు దోషాలు వేరు. ‘మూలచ్ఛేదీ తవ పాండిత్య ప్రకర్షః’ అన్నట్లు వీథినాటకానికి ఏవి నిజమయిన అందం సమకూరుస్తున్నాయో అవే బాగా లేవంటావు ఏమిటి?

పర: లక్ష్మీపతీ! వినరా వెఱ్ఱివాడా! శాస్త్రం చెప్పినట్లుగా అభినయం చేసేటప్పుడుందే, నువ్వు ఏపాత్ర అభినయిస్తున్నావో ఆ పాత్రే అయిపోవాలి. అదికాకుండా రెండో ముఖ్యమయిన సంగతి ఏమిటంటే, నువ్వు ఎప్పుడూ సంపూర్ణంగా ఆపాత్రవు కావు కాబట్టి నువ్వు ఆపాత్రను కాను, ఆపాత్రను అభినయిస్తున్నాను అని తెలపాలి. అభినయము ఒక కళ. దానివల్ల చిత్రలేఖనంలో వలే మానవుణ్ణి ఆనందంలో ముంచివెయ్యాలి. భ్రమను కొల్పడమే ముఖ్యసాధనంగా ఎంచుకుంటే, ఈ కళ ప్రాపంచికంలోకి దిగిపోతుంది.

లక్ష్మీ: ఒరే నువ్వు మాట్లాడింది కవిత్వంగాని వాదనకాదు. వాడి ఉద్దేశ్యం నువ్వు చెప్పు, బావా!

నారా: విను. భరతదేశంలో కళలన్నీ కూడా కళాస్రష్ట యొక్క ఆశయము వ్యక్తీకరిస్తాయి. ఇదే నిజము అయివుంటుంది అని భ్రమకొల్పడానికి ప్రయత్నించవు. అది అభినయంలో చూపించాలంటే, వీడేసుమా హరిశ్చంద్రుడు అని భ్రమింపజేయడానికి ప్రయత్నించక, నాహృదయానికి హరిశ్చంద్రుడిట్టివాడు సుమా అని చెప్పుతూ నేను హరిశ్చంద్రుడి వేషం వేస్తున్నాను