పుట:Narayana Rao Novel.djvu/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



౧౭ ( 17 )

రా జే శ్వ ర రా వు

నారాయణరావు, పరమేశ్వరుడు, రాజేశ్వరునితో నొక రాత్రియైన గడపుటకు సాయంకాలము గిండీ హాస్టలుకు బోయినారు. రాజేశ్వరుడు స్నేహితు లిరువురితో బుష్పశీలకు దనకుగల స్నేహము పూర్ణముగా వివరించి తెల్పెను. ఆమెలేని జన్మము తనకు దుఃఖభాజనమని తెల్పెను. ఎట్లయినను దన కామె కావలె. తనకు జదువు వలదు, ఆస్తి వలదు, చుట్టములు స్నేహితులు వలదు, పుష్పశీలయే కావలెను. ఆమె తనదగ్గర నున్న జాలును.

భర్తకడ నామెయుండ దాను రహస్యముగా రాకపోకలొనర్చుట దుర్భరము. ఆమె పూర్తిగా దనది కావలె. ఎట్లయిన ప్రపంచము తలక్రిందులుచేసియైన సరియే, యామెను గొనివచ్చెదనని యాత డుత్సుకుడై స్నేహితులతో నాడినాడు.

నారాయణుడు నిర్ఘాంతపోయినాడు. పరమేశ్వరుడు నిస్తబ్ధుడైనాడు.

నారా: ఒరే! నీపైన క్రిమినల్‌కేసు పెట్టి ఖైదులో వేయించ వచ్చురా భర్త!

రాజే: ఇంతకంటే ఆ ఖైదే మెరుగురా.

పర: ఖైదుకు వెడితే నీకేమి సౌఖ్యం? పుష్పశీల రాదుగా నీతో ఖైదుకు?

రాజే: ఒరే నారాయుడూ! నువ్వు గాంధిమహాత్ముని శిష్యుడవు, దేశంకోసం ఖైదుకు వెళ్ళావు. నువ్వూ నీవంటి పవిత్రులు ఎల్లాగైతే ధర్మం కోసం, దేశంకోసం పదేపదే ఖైదుకు వెళ్ళడానికి సిద్ధమో, అల్లాగే నేనున్నూ నాకు ధర్మం అని తోచిన యీ పవిత్రకార్యంకోసం జైలుకు వెళ్తాను. అప్పటికి దేశంలో దీన్ని గురించి ఆందోళనపుట్టి, చట్టం మార్పుచేస్తారు. ఇతర దేశాల్లో ఇంకోళ్ళ భార్యను లేవదీసుకువెళితే శిక్షిస్తారా?’

నారా: ఇతర దేశాలలో పెళ్ళి సంపూర్ణ మతసంబంధమైన ముఖ్య ధర్మంకాదు. వ్యక్తీ వ్యక్తీ ఏర్పరచుకొన్న షరతులతో కూడుకున్న ఒక ఏర్పాటు కాబట్టి, ఒకని భార్యను ఇంకోడు తీసుకుపోతే, వాడిచేత భర్తకు నష్టపరిహారం ఇప్పిస్తారు. భర్త కోరితే వాడి పెళ్ళి రద్దుచేస్తారు. నీచజాతులకు మన దేశంలోనూ కులతప్పులూ, మారుమనువులూ ఉన్నవి. ఆర్యవివాహం మోక్షసంబంధమైన మతంతో కూడుకొన్నది. నాలుగాశ్రమాలు మానవు డాత్మతత్వం తెలుసుకోడానికై చేసేయాత్రలో మజిలీలవంటివి. అందుచేతనే ఒకసారి అయిన పెళ్ళి రద్దుకాదు, మతసంబంధమైన దోషాలన్నీ శిక్షాస్మృతిలో చేర్చారు.