పుట:Narayana Rao Novel.djvu/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పు ష్ప శీ ల

169

మాడవచ్చు’ ననువారు, ‘మీరుదా బేర మేమిసామి! నాను బీదవాడుదా, నువ్వు యిచ్చే కూలిదా నాకుపొట్ట, సామి!’ అనువారు నైయుండిరి. చుట్టములను, స్నేహితులను కలుసుకొన వచ్చినవారు, భోజన వసతిగృహముల తరఫు మనుష్యులు, వీరియందరి రణగుణధ్వనితో నాప్లాటుఫారము బోరుకలుగుచుండెను. నారాయణరావు విసవిస మధ్యతరగతి బండికడకు బోవుటయు నందుండు రాజేశ్వరుడు చిరునవ్వు నవ్వుచు దిగినాడు.

‘ఏమిరా వచ్చావు? మీ అమ్మగారి జబ్బు ఎల్లావుందిరా?’

‘నిమ్మదిగావుంది. అందుకనే వచ్చాను.’

‘కళ్ళు గుంటలడ్డాయి, మీ అమ్మగారికి రాత్రింబగలు పరిచర్యకాబోలు. వెఱ్ఱికాయా! దిగు నీపనిచెపుతా.’

‘చిత్తం సామి!’

‘సామాను కారుకు పట్టుకురారా!’

‘ఏవిస్తురు సామి?’

‘నీ మెడ విరుస్తురుగాని రారా!’

కూలివాడు సామానుతో రా, మిత్రు లిరువురు నారాయణ కారుకడకు బోయి కారు వెనుక సామాను కట్టినారు. ఆకా రిరువురికే సరిపోవును. బండిని బాగుచేయుటకు, నవసరమైన నడుపుటకు నొక యువకుడు బండి వెనుకతట్టున నున్న యాసనముపై గూర్చుండును. నారాయణరావు కారునడుపుచు, గవర్నరుగారి భవనముదారిని సైదాపేట మీదుగా గిండీదారి పట్టించెను.

దారిలో రాజేశ్వరుడు తన యదృష్టమును వర్ణించినాడు. ‘వెళ్ళినందుకు పని సఫలమయినది. నాజన్మ తరించిందిరా. ఒరే, నారాయుడూ! ఆ పిల్ల అందం నువ్వు కనివిని యెరగవురా. అందమైన స్త్రీతో చెలిమిచేయని మగవాడి జన్మ వ్యర్ధంరా!’

‘నీ ప్రేమతత్వంతో నాకు మతిపోతూవుంది, రాజీ!’

‘నువ్వు వట్టి పిరికిపందవురా నారాయణా! నీపిరికితత్వాన్ని నువ్వు ‘ధర్మం’ అని పేరుపెట్తున్నావు.’

‘ఒరే దద్దమ్మా! నిన్ను ముక్కలు ముక్కలుకింద విరగగొట్టేస్తా. విను. వాదన సరీగాచెయ్యడం నేర్చుకో. ‘నేను చేసింది తప్పు, నా దేహాన్ని నా మనస్సును ఆపుకోలేకుండా ఉన్నాను. అది నా దౌర్బల్యం’ అని ఒప్పుకోక మమ్మల్ని పిరికివాళ్ళంటావు. ఇంతకీ నువ్వంటే నాకుండే ప్రేమ చేత చెపుతున్నాను. నువ్వెలాంటివాడవైనా నాకు స్నేహితుడవే. పరస్త్రీ, పరునిభార్యను నువ్వు గంగలోకి దింపావు. ఇప్పుడైనా ఒడ్డుకు చేర్చు; లేదూ, నీయిష్టం. నేను చెప్పేది యింతే,’