పుట:Narayana Rao Novel.djvu/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రా జే శ్వ ర రా వు

171


రాజే: నువ్వు న్యాయం చెప్పరా! మనం ఇప్పుడు జీవితాన్ని ధర్మ దృష్టితో చూస్తున్నామా? మనం ఉదయం లేస్తే సాయంత్రం వరకు చేసే పనులు మతదృష్టితో చేస్తున్నామా! వట్టి అల్పభావాలతో సూపర్‌స్టిషన్‌తో చేస్తున్నాము. అల్లాంటప్పుడు పెళ్ళి రద్దుచేసుకునేందుకు వీలుండే శాసనం, పరపురుషుడితో విహరించడానికి స్త్రీకి స్వేచ్ఛయిచ్చే శాసనం. ఇవన్నీ ఉండవద్దూ?

నారా: అవునులే! ప్రభుత్వం తన యిష్టంవచ్చినవి శిక్షాస్మృతిలో జేర్చి ఇష్టంలేనివి వ్యాపారసంబంధం చేసిపెట్టిన స్మృతే యిప్పుడు మనకు అది పోయినా నా------------ కాని ... వివాహం రద్దుశాసనం... నాకు ఏమీ ఇష్టం...... లేదు.

పర: ఏమిటిరా ఆ నసగడం! విను మరి. ఇప్పుడన్నీ ప్రభుత్వంవాళ్ళు లాలు చేశారు. ఇదివరకు ధర్మాలిప్పుడు అమల్లోలేవు. ఇక ఎన్ని లాలు చేస్తే ఏమిభయం అంట.

నారా: (కోపంతో) అసలే మండిపోతోంది. మన దౌర్భాగ్యతవల్ల మనదేశం పరులపాలయింది. అందువల్ల వచ్చిన కష్టాలు, దోషాలు తప్పనిసరిగా వచ్చినవే మన్ని వేపుకుతింటోంటే, మన్ని మనం బాగుచేసుకోని, శాసనాల చేతుల్లో బడని ధర్మాలనన్నా కాపాడుకోకుండా, యింకా తగులడాలీ? నేను పూర్వాచారపరాయణుణ్ణి, సనాతనవాదిని అనిచెప్పి మూర్ఖపు పట్టులు పట్టే దద్దమ్మను కాను. కాని అత్యుత్తమ ఉదారహృదయంతో, మతదృష్టితో, ఆత్మసామ్రాజ్య దృష్టితో వివేకానంద, మహాత్మగాంధి మొదలగు అవతార పురుషులు మన కిచ్చిన ఆదేశాల్ని ఆధారంచేసుకొని సంఘం బాగుచేసుకుంటే అభ్యుదయ మంటాను. కాదా?

రాజే: కోపం మాని ఇప్పుడు నా విషయం నువ్విచ్చే సలహా ఏమిటో చెప్పు. పరమం ఇచ్చే సలహా ఏమిటి? చెప్పండి. నేను ఉడికిపోతున్నా. చదువుమీదికి దృష్టిపోదు, నిద్రలేదు, ఆహారం సహించడం లేదు. చెప్పండి. లేక పోతే... ఏరోజునో హిందూపత్రికలో ‘ఒక యువకుని మరణము.... ఎస్. ఐ. ఆర్. రైలుపట్టాలమీద శవము, ఆత్మహత్య!’ అని వింటారు.

పర: ఛీ! ఛీ! నావళ్ళు జలదరిస్తోంది. నాకు గుండె దడదడమంటూంది.

రాజే: గుండెకాయ గంతులేసి నోట్లోంచి ఊడిపడలేదుకదా! ఆడంగి కానా!

నారా: కుంకాయి! వాడిజోలికి వెళ్ళకు. ఆదివారంనాడు నేనూ, రాజూ, పరమం వస్తాము. ఆరోజున నీ సంగతి ఆలోచిద్దాం, మరి పడుకుందాం.

రాజే: నారాయుడూ! నాకు నిద్దర పట్టదు, మీకుమాత్రం నేను ఎందుకు పట్టనివ్వాలిరా!