పుట:Narayana Rao Novel.djvu/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


౪ ( 4 )

నారాయణుడు

బెజవాడ ప్లాటుఫారములో నారాయణరావును జూచునప్పటికి, జమీందారు గారికి హృదయ మొక్కసారి యేలోకో ద్రవించిపోయినది. అస్పష్టముగ నొక్క వాక్కు ఇతడే శారదకు వరుడు అని తన హృదయాంతరాళము నుండి నిశ్శబ్దగీతాన ప్రతిధ్వనించినది. నారాయణరావుకు వివాహము కాలేదని ఏల తట్టినదో జమీందారుగా రీనాటికిని చెప్పలేడు.

వ్యవహారములకై వచ్చినవారితోడను, తోటివారితో మాత్రమే సంభాషించు జమీందారుగారు నారాయణరావుకడకేగి ‘మీకు వివాహ మైనదా?’ యని ప్రశ్నించినారు. పిమ్మట మొగమెరుకగల రాజేశ్వరరావువలన నారాయణుని గూర్చిన వివరములడిగి తెలిసికొన్నారు. ఆయనకంటికి పుస్తకాల దుకాణము కడ దూరముగా నున్నప్పుడే నారాయణరాయని యాజానుబాహువిగ్రహము, పురుషత్వము మూర్తీభవించిన తేజముతో కనుపించినది.

అవయవస్ఫుటత్వము కమ్మెచ్చున దీసినట్లున్నను, అతని కనుబొమలలో, పై పెదవి మెలుపులో, రేఖలు తిరిగిన నిడివిచెవులలో, సమమైన నాసికలో, వనితాలాలిత్యము వెన్నెలవలె ప్రవహించుచుండును. గాఢముష్టిఘాతమున స్తంభమునైన విరుగగొట్టగల యాతని చేతులు దీర్ఘాంగుళులతో, మెత్తని తలములతో నందమైయున్నవి. ఎత్తయి విశాలమైన యాతని ఫాలము, నల్లని దట్టమైన జుట్టు పొదువుకొన, కారుమబ్బు లాక్రమించిన వెన్నెలతులుకవలె విరిసి పోయినది.

నారాయణరాయని యౌవనసుదృఢ దీర్ఘ దేహకాంతి ప్రవాహములో జమీందారుగారు చిరపిపాసువగు హృదయమును తనివోవ నోలలార్చినారు. తమకు సమీపమందుననే యిన్నినాళ్లు దాగియున్న యీ పురుషరత్నమును తన భాగ్యదేవత నేటికి సాక్షాత్కరింపజేసినదని మురిసిపోయినారు.

లక్ష్మీపతి నారాయణరావునకు మూడవ బావమరదియు, మేనత్త కొడుకును. తలిదండ్రుల కొక్కడే సంతానమగుట సోదర సోదరీ ప్రేమ యెరుగక, తన హృదయమంతయు నత్తవారి కుటుంబమునకు ధారపోసినాడు. చిన్న బావ యగు నారాయణరావును తమ్మునివలె ప్రేమించినాడు. ఆతని భావనాపథముల నారాయణరావు అమర్త్యబాలకుడు.

ఏలూరినుండి తాడేపల్లిగూడెం స్టేషనువరకు లక్ష్మీపతి శ్రవణపేయముగా నారాయణుని గుణగణవర్ణన చేయుచుండ, స్పెన్సరుచుట్ట కాల్చుచు మెత్తని మొదటితరగతి దిండుపై పరచిన బూరుగదూది దిండ్లపై నొరగి, జమీందారు గారు హృదయమార వినుచున్నారు.