పుట:Narayana Rao Novel.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా ర య ణు డు

17


‘నారాయణ మనస్సు చాలా మెత్తనండి. ఒకళ్ళ బాధ చూళ్ళేడు. చిన్న బాలుడుగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఏడిస్తే వాడికళ్ళ గౌతమి తిరిగేది. తన అందమైన వస్తువుల్ని వాళ్లకిచ్చి ఊరడించడానికి ప్రయత్నించేవాడు. ఎంతమందో నౌకర్లున్నా చెల్లెళ్ళనీ, అన్న గారి బిడ్డల్ని తనే ఎత్తుకుంటాడు. ఆ పిల్లలు తల్లిదండ్రులకన్న నారాయణంటే చెంగున గంతువేసేవారు. చంటిబిడ్డ తలిదగ్గరకు వెళ్ళడమల్లా పాలకోసమేగాని వాడి ప్రక్కలోనే నిద్ర. మా వాడి గొంతుకలో తేనెల తీయదనం, ఉరుముల గాంభీర్యం పెనచుకొన్నాయి. పాటలుపాడ్తే నాకు కళ్ళనీరు తిరిగేది. సంగీతం నేర్చుకోరా అంటే నేనంత పవిత్రుణ్ణి కానురా అనేవాడు.

‘బళ్ళలో చదివేటప్పుడు తోటివాళ్ళొక్కళ్ళూ బాధపడకూడదు కదాండి. పుస్తకాలు బొమ్మలు తినుబండారాలు అందరికీ అస్తమానం పంచుతూ ఉండేవాడు!’ తాడేపల్లిగూడెమునుండి నిడదవోలువరకు నారాయణరావు చదువు సంగతి లక్ష్మీపతి జమిందారుగారికి పదముపాడినాడు.

‘ఎప్పుడూ ఏ పరీక్షా తప్పలేదు. ప్రతి తరగతిలోనూ మొదటివాడే. ఇంటరు మూడు సబ్‌జెక్ట్సులో మొదటిమార్కులు, బంగారు పతకాలు సంపాదించాడు. ఇంతలో మహాత్మగాంధీగారి సహాయనిరాకరణం వచ్చింది. రాజమండ్రి కాలేజీ వదలివేసి దేశంకోసం పనిచేశాడు. ఖైదుకు వెళ్ళాడు. ఆరు నెలలు నిర్భయంగా కృష్ణ జన్మస్థానంలో గడిపాడు. వచ్చాడు. స్వరాజ్యపార్టీ అంటే ఇష్టం లేదు. బి. ఎస్ సి. ఆనర్సు చదివాడు. రెండవ వాడుగా నెగ్గాడు. ఎఫ్. ఎల్. లో మొదటిస్థానము తప్పదుకదాండి.’

నిడదవోలు దాటేసరికి లక్ష్మీపతి తన బావగారి ఆస్తి వేదపారాయణము చేసినాడు. ‘ఇద్దరన్నదమ్ములు. మూడువందల ఇరవై యకరముల మాగాణి ఉంది. తోటలు ముప్పయి యకరములపైన ఉండవచ్చు. వడ్డీ వ్యాపారంలో లక్షా అరవై వేలవరకు తిరుగుతున్నట్లు జ్ఞాపకం. బ్యాంకులో షేర్లతోపాటు రెండు లక్షల రూపాయలవరకు ఉన్నవి. ఎంత లేదన్నా ఇరవైవేలదాకా నికరాదాయం ఉంటుంది. మా మామ గారు సుబ్బారాయుడు గారు మంచి గుణవంతులు. మా అత్తగారు జానకమ్మగారు పార్వతీదేవి. నలుగురు కొమార్తెలకు వివాహాలయినాయి. మంచి సంబంధాలు చేశారు.’

జమీం: సర్వవిధాలా వరప్రసాదిగా ఉన్నాడు మీ బావమరది. నా సంకల్పానికి దైవమనుకూలిస్తే, మా అమ్మాయి నేనూ కూడా ధన్యులమవుతాము.

లక్ష్మీ: అదేమిటండీ! తమరు గొప్పవారు. తమరు తలచుకొంటే జమీందార్ల సంబంధాలే కుదురుతాయి.

జమీం: సరి, జమీందార్ల మాటకేమి గాని మన నియోగులలో సరియైన ఒక్క సంబంధం చెప్పండి. మీరు చిన్నవారు. చదువుకుంటున్నారు. మీ యెఱుకను మంచి సంబంధం చెప్పండి.