పుట:Narayana Rao Novel.djvu/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగన్మోహనరావు

129

డయానాకన్య సుందరి. ఆమె దేహకాంతి దంతమువలె స్నిగ్ధమైన తెలిపసిమి కలది. ఆమె పెదవులు రంగులేకయే ప్రవాళములవలె నెఱ్ఱనై తేనె లూరుచుండును. పొట్టియైనను, మంచి యవయవస్ఫుటత కలిగి ‘చక్కని జంతువు’ అని యూరేషియను యువకులచే బొగడ్తలందినదామె. ఈతలో, టెన్నిసుబంతి ఆటలో, నాట్యములో నామెదే ముందంజ. పియానో అద్భుతముగ వాయించగలదు. ఆమె గొంతు ---మగు ‘సొప్రానో’ స్వరము కలదియట. వాల్టేరులో జరుగు క్రిస్‌మస్ వేడుకలలో నామెయే నాయకురాలి వేషము వేయును. సంగీత ప్రదర్శనములో నామెదే ముందంజ. వాల్టేరు విశాఖపట్టణముల పాశ్చాత్యులలో యూరేషియనులలో నవనాగరికులలో నామె నాసించని పురుషుడొక్కడును లేడు. అట్టి తరుణమున నామె శ్రీమంతుడగు జగన్మోహనుని వరించినది.

వారి కారు సింహాచలము రాచబాటపై నలమండ మొదలగు గ్రామములు దాటి భీమునిపట్టణము వెళ్ళినది. వారు బండి దిగి సముద్రతీరమున నడుచుచూ ఏకాంత ప్రదేశమునకు జని యా సైకతముపై నధివసించిరి. వారపరిమిత మోహావేశులై యా చీకటిలో తారకాకాంతులలో సముద్రము గంభీర సంగీతము పాడుకొనుచుండునప్పుడు సర్వము మరచిపోయిరి.

కొంతసేపటికి వారు నర్మసంభాషణము లాడుకొనుచు మందహాసముతో మరల బండినెక్కి యెనిమిది గంటలకు విశాఖపట్టణమువచ్చి చేరుచు, వాల్టేరులో రొజారియొ యను గార్డు గృహముకడ నాగి గార్డు దంపతులను వారి బాలికను కనుగొనివచ్చిరి. ఆ రోజున జేమ్సు ఇంటికడ జగన్మోహనునకు విందు. జగన్మోహనునకు గొడ్డుమాంసముతప్ప తక్కిన మాంసాహారము భక్షించు నలవాటు లేదు. మాక్లీను దన హృదయము చూరగొన్న రొజరియో కూతురు, ఆమె తల్లిదండ్రులను వాల్టేరునుండి విందుకు బిలిచినాడు. వారికై మాక్లీను నాతని తల్లియు నుచిత వేషములతో నెదురుచూచుచుండిరి.

జేమ్సు మాక్లీను ఇంటి ముందరి వసారాలో గోడలకు నీటిరంగు చిత్రములు, పెద్దపులి తలలు, బల్లెములు, బాణములు తగిలించియున్నవి. పరుపు, కుర్చీలు, బల్లలు, బల్లలపై చీనాదేశపు ఇత్తడి కూజాలు, కూజాలలో పుష్పములున్న కొమ్మలు అలంకరింపబడి యున్నవి. గుమ్మములకు డమాస్కసు తెరలు వేలాడదీయబడియున్నవి. దూరముగా నా వసారాలో బల్లలపై దీపము లిరు ప్రక్కల వెలుగుచున్నవి. మనవా రందఱు కుర్చీలపై నధివసించిరి. ఆ రోజు మెయిలులో జరిగిన యొక వింతనుగూర్చి మిస్టర్ రొజారియొ చిరునవ్వుతో డయానావైపు తిరిగి చెప్పచుండెను. డయానా తల్లియు, మిసెస్ రొజారియొ యు దక్కినవారికి వినబడకుండ నేదియో చెప్పుకొనుచుండిరి. జేమ్సు తన బాలిక ఫ్రాన్సిస్‌ను దీసికొని తోటలోనికి నాలుగడుగులు పచారు చేయుటకు వెళ్లి యా నడకలో