పుట:Narayana Rao Novel.djvu/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

నారాయణరావు

జగన్మోహనరావు పాలిపోయిన తెలుపునగలియు పసిమివర్ణమువాడు. సున్నితమగు పలుచని మేనివాడు. కోలనగు మోము, కొంచెము బుర్రముక్కు, ఫ్రెంచి మీసములు, పెద్దనోరు, చిన్నచెవులు, సూదివలెనున్న గడ్డము, ఉంగరములు చుట్టియున్న తుమ్మెదరెక్కలవంటి జుట్టు, విపరీతముగా నెత్తైన ఫాలము నా యువకునకు వింతసొబగు సమకూర్చినవి. ఆతనికడ జమీందారీఠీవి యున్నది. జమీందారీహృదయ మున్నది. ఇంగ్లండు దేశములోనున్న ప్రభువుల వలె దా నుండవలయునని యాతనికోర్కె. డైమ్లరుకారు, పియానో వాద్యము, గిండీ పోటీపందెములకు నొక యరబ్బీగుఱ్ఱము, నెలకు డెబ్బది రూపికలకొక యాంతరంగిక మంత్రి, వేసవికాలములో ఊటీ ప్రయాణము, గోల్ఫుఆట, ఇంగ్లీషు నాట్యము, పాశ్చాత్య వేషము ...... ఇది వారి రాచఠీవి.

విశాఖపట్టణములో ఆగస్టు నెలలో ఆనాటి సాయంవేళ తన డైమ్లరు కారునుండి మాక్లిన్ జేమ్సుగారి ఇంటిలోనికి బోవగనె, యాతని సహోదరి డయానా జేమ్సు జగన్మోహను నెదుర్కొని తన రెండుచేతు లాతని కందీయ జగన్మోహను డా యువతిని బిగియార కవుగిలించి తనివోవ ముద్దుగొనెను.

‘మోహన్! కొంచెం ఆలస్యం అయిందే! నువ్వు సరిగా వేళకు వచ్చే వాడవు, ప్రాణప్రియా?’

‘ఒక చిన్న వ్యాపారం వల్ల ఆలస్యం అయింది. ప్రియతమమైన డయన్! క్షమించు. ఎప్పుడు నీ పెదవుల ద్రాక్షసుధారసము త్రాగుదామా అని ఉవ్విళ్ళూరుతూ నిముషానికొక యుగంగా లెక్క చూసుకుంటూ చెన్నపట్నాన్నుంచి వచ్చాను. రెక్కలు కట్టుకొని నీ దగ్గర వాలా!’

‘నీ గుఱ్ఱం బొబ్బిలిపందెములో మూడవదిగా వచ్చినందుకు చాలా సంతోషం అయింది. నీకప్పుడే తంతినిచ్చా! ముందుసంవత్సరం ‘గవర్నరు’ పందెములో మొదటిదిగా వస్తుంది.’

‘ఆ! ఈయేడు గవర్నరు పందెంలో మొదటిదిగావచ్చిన ‘హ్యాపీ వారియర్’ గుఱ్ఱాన్ని స్వారీచేసిన బ్రౌను కిప్పుడే కంట్రాక్టు ఇచ్చాను. ప్రసిద్ధి కెక్కిన రెయినాల్డ్సుకు గుఱ్ఱాన్ని తయారుచేయుటకు అప్పజెప్పివచ్చాను షికారు రా! డయిన్.’

మరల నామె నాతడు గ్రుచ్చి గౌగిలించుకొని, గబగబ పెదవి, కన్నులు, మెడ, చెవులు ముద్దిడుకొనెను.

వారిరువురు కారులోనికిబోయి కూర్చుండబోవుచుండ జేమ్సుతల్లి లోపలి నుండివచ్చి త్వరితముగ దిరిగిరండని చెప్పిపంపినది. జేమ్సింకను వివాహము చేసికొనలేదు. తల్లిదే ఇంటి పెత్తనము. ఆమెయే డయానా జగన్మోహనులకు సంబంధము కలిపి యద్దాని నానాటికీ వృద్ధిచేసినది. జగన్మోహనుడు డయానాకు నెలకు రెండువందలు జీతమిచ్చును. అప్పుడప్పు డాతడిచ్చు బహుమతులు మొత్తము సాలుకు మూడు నాలుగువేల రూపాయల ఖరీదుండును.