పుట:Narayana Rao Novel.djvu/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

నారాయణరావు

నామె చెవిలో ‘నా హృదయం నీ కర్పించాను. ఏమి చేసినా నీదే భార’మని యస్పష్టముగ గాఢవాంఛాగద్గదికమైన స్వరమున జెప్పచుండెను. జగన్మోహనుడు డయానా యందము కన్నులార గ్రోలుచు తన్మయు డగుచుండెను.

ఇంతలో దేశవాళీ క్రిస్టియను బట్లరు వచ్చి యందరకు షెర్రీద్రాక్షాపానీయము గాజుగ్లాసులలో నందిచ్చెను. అందరు నది నెమ్మదిగా త్రాగినారు.

డయానా దుస్తులుమార్చి భోజన సమయోచితమగు గౌను ధరించుటకు లోనికి బోయినది. జగన్మోహనుడు, సేవకుడు తన దుస్తు లొక తోలు పెట్టెలో కొనిరా, నవి ధరించుటకు లోనికి బోయెను.

తొమ్మిదిగంటల కందరు విశాలమగు భోజనమందిరమునకు బోయి యచ్చట మందిరమధ్యమున నమర్చియున్న మేజాబల్ల చుట్టు నధివసించినారు. బల్లపై తెల్లటి దుప్పటి పరచి, యందు పదికొవ్వువత్తి దీపపుబుడ్లు వెలిగించినారు. బల్ల పెద్ద కోడిగుడ్డాకారమున నున్నది. ఒడిలో నేపదార్థము పడినను దుస్తులు పాడయిపోకుండ కప్పుకొనుట కై మడతలిడి యుంచిన తెల్లని రుమాళ్ళు తీసికొని యందరు నొడులపై నడ్డముగా బరచుకొనిరి. ప్రథమమున వారందరు ద్రవ పదార్థము పుచ్చుకొందురు. అయ్యది యెముకల రసములో బోపు వేసినది. తర్వాత కోడిపిల్లవంటకము, కాబేజీ మధురము మొదలగు రుచ్యములైన పదార్థము లొకటివెనుక నొకటి తీసికొనివచ్చుటయు వారందరవి పుచ్చుకొను నుండిరి. మధ్యమధ్య చాంపేనుపానము సోడాతో కలిపి త్రాగుచుండిరి.

పదిగంటలన్నర యగునప్పటికి భోజనములు పూర్తియైనవి. పిమ్మట వారు చిత్రవిచిత్రములుగ తయారు చేసిన చాంపేనుబ్రాంది, విస్కీ బోర్డియో ద్రాక్షాది పానములు త్రాగి యానందించినారు.

డయానాను పియానో వాయింపుమని జగన్మోహనుడు ప్రార్థించెను. వారందరు సంగీతపు గదిలోనికి బోవుటయు, డయానా పియానో వాయించుచు నతిశ్రావ్యముగ బాడినది.

పిమ్మట డయానా వాయించుచుండ ఫ్రాన్సిస్‌కన్య కొంతసేపు పాడినది. పాశ్చాత్య సంగీతము పాడుటలో వాయించుటలో యూరేషియను జాతివారు చాల ప్రసిద్ధి చెందినవారు. యూరపియనుల సభలలో, వీరు పోయి మధురముగ బాడి వారిహృదయముల రంజింపుచుందురు.

పాశ్చాత్య సంగీతమునకు భారతీయ సంగీతమునకు మూల మొక్కటియే యైనను భారతీయ సంగీతసంప్రదాయ మొకమార్గమున ప్రవహించి మహాద్భుతముగ విజృంభించినది. ఆ మార్గముననే కొంతవరకు నడచిన పాశ్చాత్య గానవిద్యా సంప్రదాయ మంతటితో నాగిపోవ, నూతన సాంప్రదాయమును నిర్మించి జర్మనుజాతి యా గానమునకు క్రొత్త జీవము పోసినది.

భారతీయ సాంప్రదాయము రాగతాళముల ననేకరీతుల వృద్ధిచేసినది. పాశ్చాత్య సంప్రదాయము శ్రుతిని వివిధమార్గముల బెంపొందించినది. వారికి