పుట:Narayana Rao Novel.djvu/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

నారాయణరావు

నాయనకు దేహము కంపించిపోవును. ధనము లేనిచో పస్తుండును గాని ఒక కాని పద్దువ్రాయడు, నోటు వ్రాయడు.

పెద్దకుమారుడు విశాఖపట్టణము కాలేజీలోనున్న ఉన్నత పాఠశాలలో చరిత్ర పాఠముల చెప్పు నుపాధ్యాయుడు, వరదరాజులు బి. ఎ., ఎల్. టి. గారు. రెండవ కుమారుడు శ్రీరంగనాయకరావు. ఎటులనో స్కూలు ఫైనలు పరీక్ష పూర్తిచేసి, పెద్దాపురము మునసబు న్యాయస్థానములో లేఖరి యుద్యోగము తండ్రిగారి ప్రాపకముచే బొంది, తగులంచములుగొనుచు భార్యాబిడ్డలతో గాలక్షేపము చేయుచుండెను. మూడవయాతడు బి. ఎ.,బి. ఎల్. పరీక్షలలో గృతార్థత నొంది అప్రెన్‌టిస్అయి, హైకోర్టు వకీలయి, అనకాపల్లిలో న్యాయవాదివృత్తి సలుపుచు, బదిరాళ్ళయిన నింటికి దేలేక, తండ్రిగారి ప్రాపకముచే నెప్పుడు మునసబీపని యగునా యని గడియలు యుగములుగా లెక్కపెట్టుచుండెను. పరమేశ్వరమూర్తి నాల్గవవాడు. పరమేశ్వరమూర్తి వెనుక నొక బాలిక ఉమ, ఆమె వెనుక నిరువురు కవలలు, రామారావు, లక్ష్మణరావులు. వేంకటరమణమూర్తిగారి జన్మమును దరింపజేయ నుద్భవించిరి. వారిరువురు నాల్గవఫారము చదువుచుండిరి. ఇట్టి చిక్కులలో నుండుటవలననే వెంకటరమణమూర్తిగారు, పరమేశ్వరునికి అనేక విధములగు సహాయము తామొనరింపజాలమనియు, కుమారుడు అందరితోబాటు తనకడనున్న ఎట్టులో కలో గంజో పోయగలననియు, నితరస్థలములకు బోయినచో, పరమేశ్వరుడు తన కుటుంబమును దానే భరించుకొనవలయుననియు మొగమాటము విడిచి జెప్పినారు.

పరమేశ్వరుడు నారాయణకన్న రెండేండ్లు పెద్ద, పందొమ్మిది వందల ఇరువది రెండవ సంవత్సరము గాంధీమహాత్ముడు భరతదేశ దాస్యశృంఖలా విమోచనమునకని ప్రారంభించిన అసహాయోద్యమములోజేరి, పరమేశ్వరుడొక సంవత్సరము కారాగారవాస మనుభవించెను. అప్పటి కాతని వయస్సు పందొమ్మిది. బి. ఏ. చదువుచుండెను. నారాయణరావునకు పరమేశ్వరునకు చెఱసాలయందు గాఢస్నేహము కుదిరినది. చెఱ వదలి వచ్చిన వెనుక వారిరువురి మైత్రి తీగవలె నల్లుకొనిపోయి వారిరువురి యాత్మలొకటి, దేహములు మాత్రము వేరైనవి. పరమేశ్వరుడు 1924 లో బి.ఏ. పూర్తి చేసెను.

నారాయణరావు పరమేశ్వరులిర్వురు సర్వకళోపాసకులు. నారాయణరావపరిమిత మేధాసంపన్నుడు. పరమేశ్వరునికి జ్ఞాపకశక్తికన్న సృజనాశక్తి మెండు. నారాయణరావునకు కళాసృష్టి శక్తికన్న, ధీశక్తిమిన్న. నారాయణరావు చూపుమాత్రాన నెట్టివిషయమును సర్వార్థములతో గ్రహింపగలడు. ఏ జటిలవిషయమునైన సులువుగ బోధపడురీత నుపదేశింపగలడు. ఉపన్యాస మీయగలడు. నారాయణునకు జ్ఞాపకశక్తి యత్యద్భుతము. శాస్త్రజ్ఞానములో ఎయిన్ స్టెయిన్ మొదలగు పండితోత్తముల గ్రంథము లాతనికి మంచినీళ్ళ ప్రాయములు. అర్థమయిన విషయములు తలచినంతమాత్రాన నాతని మనోముకు