పుట:Narayana Rao Novel.djvu/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాఢస్నేహము

121

రమున ప్రత్యక్షములగును. నారాయణ జ్ఞానపిపాసకు, ఈశాస్త్రమాశాస్త్ర మని హద్దులేదు. అతని ధీకిరణము సర్వశాస్త్రములపై ప్రసరించును. రామన్ గారి ‘కిరణ’ విషయజ్ఞానమన నెంత ప్రేమయో ఆంధ్రేతిహాస విషయమునందు నంత ప్రేమయే. న్యూటను, ఎయిన్ స్టెయిన్, ఆడిసన్, గౌతమ కణ్వాదులు, నాగార్జునులు అతనికి చిరపరిచితులు. మహాపండితుల సిద్ధాంతము లెంతశ్రద్ధమై గ్రహించునో, శోణానదిపైని వంతెన పొడవును, చీనా కుడ్యచరిత్రను, ఆర్మీనియనుజాతివారి చరిత్రమును, సముద్రమీన భేదములను, అవి యివి యన నేల సమస్త వస్తుజ్ఞానమును ఆతడంత యాస్థమే గ్రహించును.

పరమేశ్వరుని జ్ఞానశక్తి నారాయణరావు మేధాశక్తి యంత యగాధము కాదు. ఇరువురి హృదయములు రసార్ద్రములే యగును కాని, పరమేశ్వరుని యందు లలితకళాశక్తి యెక్కువ విజృంభించియున్నది. ఇరువురు సౌందర్యోపాసకులే. ఇరువురు జ్ఞానప్రియులే కాని పరమేశ్వరుడు తుమ్మెద, నారాయణుడు తేనెటీగ. జ్ఞానామృత సంపాదనమున నిదియే వారికిగల భేదము.

నారాయణరావు గంభీరహృదయుడు. పరమేశ్వరుడు దర్పణప్రతిమాన హృదయుడు. ఒక రహస్యము దాచలేడు. ఒక భావము గుప్తపరచుకొనలేడు. అయినను అతని జ్ఞానము సర్వతోముఖము. అతని జన్మలగ్నమున బుధు డున్నాడు.

పరమేశ్వరుడు లతవలె నెల్లకాలము నెవరో యొక ధీశాలియగు స్నేహితుని జుట్టియుండును. స్నేహితులేనినా డాతడు ప్రపంచమున నొంటియై యుంటినని భావించును. కాని పెక్కుఘంటిక లాత డొక్కరుడు ధ్యాన స్థిమితుడై యుండగలడు. ధీరత్వమునగూడ పరమేశ్వరుడు తక్కువవాడు కాడు. కారాగృహవాసమన్న వెనుకంజ నిడలేదు. ఒక్కడు గోదావరిలో బాతువలె నీదుకొనుచు మైళ్ళకొలది పోగలడు.

పరమేశ్వరుని హృదయము వెన్న వంటిది. స్త్రీలలో స్త్రీవలె మెలగగలడు. ఆడువారికున్న నాజూకులన్నిటిలోను నాతడు నిధి. అన్నిరకముల పాటలు పాడగలడు. అభినయము చేయగలడు. ఆడువేషము వేసినచో సుందర స్త్రీమూర్తియై, వనితలనే భ్రమింపజేయగలడు.

అతని మనస్సు మైనమువంటిది. ప్రాపంచిక సాధకబాధకము లాతని మనస్సు నెక్కువ కలత బెట్టినను, అవి తాత్కాలికములై, క్షణభంగురములై మఱునిమేషమున నంతరించిపోవును. అతని మనము యథాసంతోషస్థితి నందును.

నారాయణరావు తన హృదయమునకు నచ్చినవారితోడ స్నేహ మొనరించును; పరమేశ్వరు డందరకు స్నేహితుడే. కాని పరమేశ్వరుడు కొలది మందికే తన సంపూర్ణహృదయము ధారపోయును. ఇరువురును గాఢముగ