పుట:Narayana Rao Novel.djvu/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

నా రా య ణ రా వు


కొత్తపేటలో సూర్యకాంతమును, ఒక వత్సరము మానివేసినందున, మాణిక్యమును నోముబట్టిరి. తమయింట నాచారమున్నది గాన గోడలిచే నోము పట్టింపవలయునని సుబ్బారాయుడుగారు వియ్యంకునకు వ్రాసినారు.

పూర్ణిమ ముందు శుక్రవారమునాడు జమీందారుగారి యింట వరలక్ష్మీ వ్రతము జరిగినప్పుడు జానకమ్మగారు పూర్ణాభరణభూషితురాలై వరలక్ష్మీవలెనే వియ్యాలవారింటికి వెళ్ళినది. కోడలికి నిరువది కాసులును, వియ్యపురాలికి గోడలికి వెలగల చీరలును, బంగారు కుంకుమబరణియు నన్నూరురూపాయల వెండి బొమ్మసామాను మొదలగునవి శ్రావణపట్టి పట్టుకు వెళ్ళినది. జమీందారు గారు సోదరితో నాలోచించి యల్లునికి వేయిరూపాయల సరుకు లాషాఢపట్టీ పంపించినారు. కోడలిచే నోము నోపించి జానకమ్మగారు కోడలితోపాటు చారుమతీదేవీ కథ విని మూడవ వారమువరకు అచ్చటనే యుండుడని సుందరవర్ధనమ్మ గారు కోరుటచే నాగిపోయెను.

రాజమహేంద్రవరములో శారదతో నామె పెద్ద పెద్దవా రిండ్లకు కారుమీద వెళ్ళివచ్చినది.

మంగళ గౌరీదేవికథ వినినప్పుడు శారద మేనత్తను కథార్థము విపులముగా నడిగినది. బిడ్డలులేని భార్యాభర్తల తపస్సు, పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్ష మగుట, ‘అయిదవతనము లేని బాలికయా, ఆయుస్సులేని బాలుడా వర’ మన్న ప్రశ్న. బాలుడు కావలెనని కోరుటయు, బాలుడు జనించుటయు, కుమారుని గొనిపోవ యమునిదర్శనము, పదునారవ యేట పదునారవరోజు గొనిపోయెద నని యముని వాగ్దానము (పండ్రెండవయేట, పండ్రెండవమాసాన, పండ్రెండవ దినాన నని కొందరిమతము), ఆదినము వచ్చుముందు కుమారుడు మాతులునితో మృత్యువును దప్పించుకొను మార్గము దొరకదాయని దేశములపాలగుట, వారట్లు పోవుచుండ, నొక నగర బాహ్యోద్యానవనమున గొందరు బాలికలు పూలు గోసుకొనుచుండ రాచవారి బాలయొక్క పూలు ఒలికిపోయి యెప్పటియట్ల చెట్లపై జేరుకొనుట, అది కనుంగొని మాతులు డా బాలను ఒప్పించి తన మేనయల్లునకు వివాహము చేయుట, ఆ బాలిక యింటికిపోయి, తల్లిదండ్రుల ఇచ్ఛచే నా బాలకునికి సరియైన కర్మకాండతో నతివైభవముగ పెండ్లి చేయుట మున్నగు వివరముల నెఱిగికొన్నది. ఆ బాలకుని మృత్యుదినంబునాటి రాత్రి, మృత్యువు పండ్రెండుతలల యాదిశేషుడై వచ్చి నిదురబోవు యువకుని కాటు వేయబోవుచుండ నచ్చట నా రాజకుమారి మిఠాయియుండ నునిచెనట. శేషు డా యుండపై కాటువేసెనట. ఆ బాలిక యొక యరిసెల పాత్రను జూపుటయు నాసర్ప మందు దూరెనట. తన కంచుక మూడ్చి యా పాత్రపై వాసెన గట్టినదట. అటువెనుక భర్త దేశాలు తిరుగబోయెనట. భర్త దేశాలు తిరిగివచ్చునప్పటికి ఆ పాము బంగారుపామై యుండెనట.

జానకమ్మ గారు సర్వ సౌందర్యాలు వెలిగిపోవు కోడలినిజూచి ఆనందపర